నేడు ‘మండలి’ఎన్నికలు

నేడు ‘మండలి’ఎన్నికలు

వెలుగు: శాసనమండలి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 4 వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అసెంబ్లీ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాల్‌ -1లో పోలింగ్‌ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కంపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ , బ్యాలెట్‌ బాక్స్‌ , ఇతర ఏర్పాట్లను రిటర్నింగ్‌ అధికారి , అసెంబ్లీ కార్యదర్శి వి. నరసింహాచార్యులు సోమవారం పరిశీలించారు. అసెంబ్లీ ఆవరణలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గే మల్లేశం, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌‌‌‌‌‌‌‌ ఎఫెండీ, కాంగ్రెస్‌ నుంచి గూడూరు నారాయణరెడ్డి పోటీలో ఉన్నారు . ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు, తాము జారీ చేసిన పాస్‌లున్న పోలింగ్‌ ఏజెంట్లు మినహా మిగతా వారెవరికీ అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి లేదని రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. ఎన్నికలకు కాంగ్రెస్‌ దూరమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్​రెడ్డి ప్రకటించగా, కాంగ్రెస్​కు మద్దతుగా తామూ ఎన్నికల్లో పాల్గొనడం లేదని టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్​రావు తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ పోలింగ్‌ను బహిష్కరించడంతో టీఆర్‌ఎస్‌ , ఎంఐఎం అభ్యర్థుల గెలుపు ఏకపక్షం కానుంది.

ఈసీ ఆదేశాల మేరకే తుది ఫలితాలు పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈసీ ఆదేశాల మేరకు కౌంటింగ్‌ ప్రారంభిస్తామని అసెంబ్లీ అధికారులు చెప్పారు . మొత్తం ఎమ్మెల్యేలు ఓటింగ్‌ లో పాల్గొంటే లెక్కింపు ఆలస్యమవుతుందన్నారు . ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాన్ని ఈసీకి నివేదిస్తామని, ఈ ప్రక్రియ ముగిసి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయం ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమన్నారు.