త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్

త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్

జగిత్యాల : ఫిరాయింపులతో ప్రభుత్వాలను కూల్చుతూ అధికారం చెలాయించడం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ కాలం ముగిసే వరకు పార్టీలో కొనసాగేలా పటిష్ఠ చట్టం తేవాలని కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజీవా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర దాని కుందని చెప్పారు. 

దేశ భవిష్యత్తులో యువత పాత్రను గుర్తించి 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని జీవన్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలు, మహిళలకు అవకాశం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఆర్థిక సంఘం నిధులను ఢిల్లీ నుంచి గల్లీ వరకు పంపిణీ చేసిన రాజీవ్.. ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి టెక్నాలజీకి బాటలు వేశారని అన్నారు. సంపూర్ణ ప్రజామోదం, మెజార్టీ లేదని పదవిని వదిలి ప్రతిపక్షంలో కూర్చున్న మహోన్నత నేత రాజీవ్ అని జీవన్ రెడ్డి ప్రశంసించారు. 

గుజరాత్ లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా బిల్కిజ్ బానోపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను విడుదల చేయడాన్ని జీవన్ రెడ్డి తప్పుబట్టారు. అలాంటి వారిని విడిచిపెట్టేందుకు ప్రభుత్వానికి సిగ్గుండాలని అన్నారు. ప్రధాని మోడీకి నీతి, నిజాయితీ ఉంటే మౌనముద్ర వీడి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అంశంపై స్పందించి గుజరాత్ ప్రభుత్వాన్న అభిశంసించాలని కోరారు.