వేలం నుంచి సింగరేణిని మినహాయించాలి: కోదండరాం

వేలం నుంచి సింగరేణిని మినహాయించాలి:  కోదండరాం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మినరల్ యాక్ట్ 1957 నుంచి సింగరేణి సంస్థను మినహాయించాలని టీజేఎస్ చీఫ్ కోదండరాం డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని, ఈ అంశంపై మాట్లాడేందుకు త్వరలో ఆయనను కలుస్తామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌‌ నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌‌లో పార్టీ నేతలు పీఎల్ విశ్వేశ్వరరావు, బైరి రమేశ్‌‌, నిజ్జన రమేశ్‌‌లతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సింగరేణి ఎంతో ముఖ్యమని, ఈ సంస్థ పరిరక్షణ కోసం ఉద్యమం చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. గతంలోనూ సింగరేణి పరిరక్షణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ పోరాటం చేశారని గుర్తుచేశారు.

 సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందులో భాగంగా సేవ్ సింగరేణి పేరుతో మరో ఉద్యమం ప్రారంభిస్తామని తెలిపారు. కొత్త గనులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. శ్రావణపల్లి గని తవ్వే ప్రాంతంలో అటవీ భూభాగం ఎక్కువగా ఉందని, ఇక్కడ బొగ్గు తవ్వితే గ్రామాల్లో కొత్త వివాదాలు తలెత్తుతాయన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా పర్యావరణ విధ్వంసం జరుగుతుందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధికి చేపట్టాల్సిన పలు ప్లాన్‌‌లు తమ వద్ద ఉన్నాయని, వీటిని ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. 

ప్రైవేటు కంపెనీలకు గనుల కేటాయింపు ద్వారా లాభం ఉండదని, స్థానికులు ఉపాధి కోల్పోతారన్నారు. బొగ్గు గనుల వేలానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని, ప్రైవేటీకరణ ద్వారా జరిగే అక్రమాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పిందని గుర్తుచేశారు. బొగ్గు తవ్వకాలను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జాతీయం చేశారని గుర్తుచేశారు. సింగరేణి ఎంతో సమర్థవంతంగా బొగ్గు తవ్వకాలు చేస్తోందని, వేలం కంటే సింగరేణి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు.