ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి కడియం వార్నింగ్ 

ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి కడియం వార్నింగ్ 

నల్లగొండ జిల్లా : నల్లగొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. సమావేశానికి రాని నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులమని చెప్పుకునే కొంతమంది నాయకులు పదవులు పొంది.. పార్టీ సమావేశానికి రాకపోవడం చాలా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ లో ఉంటూ పార్టీ సమావేశానికి రాకుండా ఉండే నాయకులు ఏ పార్టీ వైపు ఉంటారో ఆలోచించుకోవాలి.

బీఆర్ఎస్ లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో మాదిరిగా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి వీల్లేదన్నారు. తిరుమలగిరి మండలంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఆయన అనుచరులు హాజరుకాలేదు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి ఎంసీ కోటిరెడ్డికి చురకలంటించారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీందర్ కుమార్ నాయక్ పాల్గొన్నారు. 

ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ మూడోవసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు కడియం శ్రీహరి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కి పరిపాలన చేయాలనుకుంటోందని ఆరోపించారు. తమకు మద్దతు తెలపని పార్టీలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ బెదిరిస్తోందన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పారు.