లిక్కర్​ స్కామ్ : అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో కవిత పేరు

లిక్కర్​ స్కామ్ : అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో కవిత పేరు
  • ఆధారాలు దొరక్కుండా 11 నెలల్లో 10 ఫోన్లు, రెండు సిమ్​లు మార్చారు, ధ్వంసం చేశారు
  • అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో ఈడీ వెల్లడి
  • అరబిందో శరత్ ​చంద్రారెడ్డి, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు కూడా ప్రస్తావన
  • సౌత్​ గ్రూప్​ నుంచి విజయ్​ నాయర్​కు 100 కోట్లు
  • 153 ఫోన్లు ధ్వంసం చేసిన 36 మంది నిందితులు.. వాటి విలువ రూ. కోటీ 38 లక్షలు
  • ఆ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లతో సహా రిపోర్టు
  • 32 పేజీల నివేదికలో పలు కీలక అంశాలు
  • అరోరాను 7 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చిన కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లిక్కర్​ వ్యాపారి అమిత్​ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ)  చేర్చింది. ఆమెతోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్​ శరత్​చంద్రారెడ్డి, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా మొత్తం 36 మంది పేర్లను యాడ్​ చేసింది. లిక్కర్​ స్కామ్​లో కీలక నిందితుడు విజయ్​ నాయర్​కు సౌత్​ గ్రూప్​ (దక్షిణాది) నుంచి రూ. 100 కోట్లు అందాయని, ఈ గ్రూప్​ను కవిత, శరత్​చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి లీడ్​ చేశారని వెల్లడించింది.  ఆధారాలు దొరక్కుండా 10 మొబైల్ ఫోన్స్​ను కవిత డ్యామేజ్ చేయడం, మార్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని, ఇందులో 6209999999 ఫోన్​ నంబర్​తో మాట్లాడినప్పుడు ఆరు ఫోన్లు, 8985699999 ఫోన్​ నంబర్​తో నాలుగు ఫోన్లు మార్చినట్లు, ధ్వంసం చేసినట్లు ఈడీ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్​ 1 నుంచి ఈ నెల ఆగస్టు వరకు ఈ చర్యలకు పాల్పడ్డట్లు రిపోర్టులో వివరించింది. స్కామ్​తో సంబంధం ఉన్న 36 మంది నిందితులు/అనుమానితులు 170 ఫోన్లను మార్చారని, తాము కేవలం 17 ఫోన్లను రికవరీ చేయగలిగామని తెలిపింది. మిగతా ఫోన్లను ఆధారాలు దొరకకుండా నిందితులు ధ్వంసం చేశారని, అవి దొరికి ఉంటే ముడుపుల లెక్క ఇంకా ఎక్కువగా ఉండేదని ప్రధానంగా ప్రస్తావించింది. ధ్వంసమైన 153 ఫోన్ల విలువ కోటీ 38 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. 

అమిత్​ ఆరోరా ఒప్పుకున్నడు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా అనుచరుడు అమిత్ అరోరాను మంగళవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్  ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా దాదాపు 32 పేజీల రిమాండ్ రిపోర్టు ను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్(ఐఓ) జోగేందర్ దాఖలు చేశారు. ఈ రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను పొందుపరిచారు. రూ.100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెల్లించిందని, సౌత్ గ్రూప్​ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది.  సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను ఢిల్లీకి చెందిన ఆప్​ లీడర్​ విజయ్ నాయర్​కు చేరినట్లు తెలిపింది. వీటిన్నింటినీ దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ఒప్పుకున్నారని ఈడీ వెల్లడించింది. 

ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా లిక్కర్​ పాలసీ

ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా లిక్కర్​ పాలసీని రూపొందించడంలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. మొత్తం మూడు లెవల్స్ లో కిక్ బ్యాగ్ మనీని ఆప్ లీడర్లు పొందినట్లు చూపింది. మ్యానిఫెక్షర్,  ఎల్ 1 డిస్ట్రీబ్యూటర్, డ్రిస్ట్రిబ్యూటర్ ఎంపిక అంశంలో లూప్ హోల్ ఉన్నట్లు గుర్తించింది. విజయ్ నాయర్, దినేశ్​ అరోరాతో కలిసి ఈ కుట్రలో పాలుపంచుకున్నట్లు పేర్కొంది. ఈ కేసులో దినేశ్​ అరోరా ఇప్పటికే అప్రూవర్​గా మారాడు. లిక్కర్​ స్కాంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 12 శాతం ఆదాయం అంటే రూ. 581 కోట్లు నష్టపోయిందని ఈడీ తెలిపింది. అలాగే దేశీ, విదేశీ లిక్కర్ల విషయంలో అమ్మకందారులకు సంబంధించి రూపొందించిన రేట్లు, ఫ్రాఫిట్, వ్యాట్, ప్రర్సెంటేజ్, ఇతర అంశాలను కూడా టేబుల్స్​ రూపంలో  ఈడీ తన రిపోర్టులో వెల్లడించింది. మొత్తం 13 మేజర్ మ్యానిఫాక్షర్ కంపెనీలు, 14 హోల్ సేల్ ఎల్ షాపులు, 32 రిటైల్స్ జోన్స్ ల సమాచారాన్ని కంపెనీల పేర్లతో సహా ప్రస్తావించింది. ఇందులో చాలా కంపెనీలను ఇన్వెస్టిగేషన్ చేసినట్లు తెలిపింది.  ఇందులో శరత్ చంద్రారెడ్డికి సంబంధించి శ్రీ అవంతిక కన్ట్సక్టర్ లిమిటెడ్, ట్రిడెంట్ చెంఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఈకో ప్రైవేట్ లిమిటెడ్ లు గా గుర్తించింది. అలాగే, లిక్కర్ కేసులో తొలుత అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, రాఘవ్ మాగుంట, అమిత్ అరోరాకు సంబంధించిన కంపెనీ పేర్లనూ పేర్కొంది. మొత్తం 32 రిటైల్స్, ఎల్ 7 జోన్స్ కు సంబంధించి రెండు ఫేజుల్లో ఢిల్లీ ఎక్సైజ్​ పాలసీకి ఆక్షన్ వేశారని, ఇందులో 20 జోన్లు ఫస్ట్ రౌండ్ లో, 12 జోన్స్ సెకండ్ రౌండ్ లో ఆక్షన్ వేశారని తెలిపింది.  2021-–-2022  ఏడాదికిగాను లైసెన్స్ ఫీజు రూ. 7,025 కోట్లు, బిడ్ అమౌంట్ రూ. 8,911 కోట్లు నిర్ధారించారని, ఇందులో లైసెన్స్ కు సంబంధించిన మొత్తం 9 విభాగాల్లో  రూ. 2, 873 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ తన రిపోర్టులో పేర్కొంది.

ఒకే రోజు ఫోన్లు మార్చారు

కవిత, బోయినపల్లి అభిషేక్​రావు, సీఏ బుచ్చిబాబు గత ఏడాది సెప్టెంబర్​ 1న ఒకే రోజు ముగ్గురు ఫోన్లు మార్చినట్లు ఈడీ గుర్తించింది. తర్వాత అదే నెల 24న అభిషేక్, బుచ్చిబాబు ఫోన్లు మారినట్లు వెల్లడించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్​ 30న మరోసారి అభిషేక్ ఫోన్ మార్చితే.. ఆ మార్నాడు 31న కవిత ఫోన్ చేంజ్ చేశారని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 19న అభిషేక్ మొబైల్ మార్చితే.. ఆగస్టు 20న బుచ్చిబాబు, రెండు రోజులు తర్వాత 22న కవిత వేరే ఫోన్ యూజ్ చేశారని వివరించింది. మళ్లీ మర్నాడు  23న కవిత రెండు ఫోన్లు మార్చారని తెలిపింది.

రూల్స్​కు విరుద్ధంగా లిక్కర్​ పాలసీ: ఈడీ

  • ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును ఈడీ కీలకంగా ప్రస్తావించింది. 
  • ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారీలో కీలకంగా ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. నిపుణుల కమిటీ రిపోర్ట్, పబ్లిక్ సూచనలకు విరుద్ధంగా జీవోఎం పాలసీని రెడీ చేసింది. జీవోఎం రిపోర్ట్ పై ఎలాంటిస్పందనలు తీసుకోలేదు. పాలసీ ఫైనలైన 3 నెలల తర్వాతే పబ్లిక్ డొమైన్ లో పెట్టారు.
  • హోల్ సేల్ వ్యాపారాన్ని తయారీ నుంచి వేరు చేసి పూర్తిగా ప్రైవేటుకే ఇచ్చేలా పాలసీని జీవోఎం మార్చింది.
  • ప్రాఫిట్ మార్జిన్ పాత పాలసీలో 5 శాతం ఉంది. దీన్ని ఏకంగా 12 శాతానికి పెంచారు. ఇంత భారీగా పెంచడానికి అర్థంలేని కారణాలు చూపించారు. ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్ నామమాత్రంగా మారింది. అసలు అమలుకాలేదు. ఇంత భారీ మార్జిన్ పెంచాలని ఎక్స్ పర్ట్ గానీ, పబ్లిక్ గానీ, స్టేక్ హోల్డర్స్ కూడా ఎవరూ అడగలేదు.
  • కొన్ని నిర్ధారించని ప్రాంతాల్లో షాపులు తీయలేమన్న పేరుతో లైసెన్స్ పొందినవారి ఫీజును తగ్గించారు. కానీ గత మూడేళ్ల కంటే ఈ పాలసీ కాలంలో సేల్స్ భారీగా పెరిగాయి. కొన్ని షాపులు తీయలేకపోవడం వల్ల వారికి ఎలాంటి నష్టం కలగలేదు. కానీ లైసెన్స్ ఫీజు తగ్గించడం వల్ల వ్యాపారులకు 719 కోట్ల అనవసర లాభం కలిగించారు. ఈ మేరకు ఖజానాకు నష్టం జరిగింది.
  • లైసెన్స్ ఫీజుల తగ్గించడం, పలు ఇతర మినహాయింపుల కారణంగా 2,873 కోట్ల నష్టం జరిగింది.

14 ఫోన్లు, 4 నంబర్లు మార్చిన సిసోడియా

లిక్కర్ స్కాంలో పెద్ద మొత్తంలో డిజిటల్ ఎవిడెన్స్​ను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో దేశవ్యాప్తంగా 178 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అనేక ఆధారాలను సేకరించింది. 36 మంది  దాదాపు రూ.1.38 కోట్ల విలువ చేసే 170 ఫోన్లు మొబైల్ ఫోన్స్ ను పగలగొట్టడం, మార్చడం ద్వారా ఎవిడెన్స్ ను మాయం చేశారని గుర్తించింది. 17 ఫోన్లను మాత్రమే తాము స్వాధీనం చేసుకోగలిగామని తెలిపింది. ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ రిపోర్టులో పేర్కొంది. ఈ స్కామ్​లో అత్యధికంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా మొత్తం 4 నంబర్లు ఉపయోగించారని పేర్కొంది. అందుకు కోసం 14 ఫోన్లను మార్చి ఎవిడెన్స్ ను నాశనం చేశారని రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీకి చెందిన మరో మంత్రి కైలాష్ గెహ్లాట్ ఒక నెంబర్, మూడు ఫోన్లు.. సన్నీ మార్వా ఒక నంబర్, 7 మొబైల్స్.. విజయ్ నాయర్ రెండు నంబర్లు, 6 ఫోన్లు.. సమీర్ మహేంద్రు ఒక నంబర్, 4 ఫోన్లు.. అమిత్ అరోరా 4 నంబర్లు, 11 ఫోన్లు.. అరుణ్ పిళ్లై ఒక నంబర్, 5 ఫోన్లు వాడినట్లు పేర్కొంది. అలాగే, సౌత్ గ్రూప్స్ కు సంబంధించి శరత్ చంద్రారెడ్డి ఒక నంబర్, 9 ఫోన్లు.. కవిత రెండు నంబర్లు, 10 మొబైల్స్.. బోయినపల్లి అభిషేక్ రావు  ఒక నంబర్, 5 ఫోన్లు వాడినట్లు ఈడీ స్పష్టం చేసింది.