
పక్కా ఆధారాలతో ఈడీ చార్జ్‌షీట్
హైదరాబాద్, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పక్కా ఆధారాలతో ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రుపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో ఎమ్మెల్సీ కవిత పేరును అనేక సార్లు ప్రస్తావించింది. సమీర్ మహేంద్రు, దినేశ్ అరోరా స్టేట్‌మెంట్ల ఆధారంగా ఉచ్చు బిగిస్తున్నది. స్కామ్‌కు సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. సమీర్ మహేంద్రు సహా 4 లిక్కర్ కంపెనీలపై అభియోగాలు మోపింది. సౌత్ గ్రూప్‌లో కీలకంగా కవిత వ్యవహరించారని, ఇందుకు సంబంధించి మీటింగ్స్ వివరాలను ఈడీ వెల్లడించింది. కవిత, సమీర్ మహేంద్రు కాంటాక్ట్ అయిన ‘ఫేస్ టైమ్’ యాప్ డేటాను రికవరీ చేసింది. హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన డబ్బు వివరాలను రాబట్టింది. బంజారాహిల్స్‌లోని కవిత ఇంట్లో జరిగిన మీటింగ్స్‌లో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా కవితతో పాటు ఆమె భర్త అనిల్‌కూ త్వరలోనే నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నాయి.
కంగ్రాట్స్ చెప్పిన కవిత!
మంగళవారం సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కీలక అంశాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎల్1, ఎల్7 లైసెన్స్‌ల ద్వారా 32 జోన్స్‌ను సౌత్ గ్రూప్ సంపాదించిందని, ఈ జోన్స్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఎమ్మెల్సీ కవితతో సమీర్ మహేంద్రు ఫేస్ టైమ్ యాప్ ద్వారా మాట్లాడినట్లు ఈడీ పేర్కొంది. ‘‘లైసెన్స్‌లు సక్సెస్ కావడంతో సమీర్ మహేంద్రుకు కవిత కంగ్రాట్స్ చెప్పారు. ఈ క్రమంలోనే సమీర్ మహేంద్రు కొన్నిరోజుల తర్వాత మళ్లీ కవితతో మాట్లాడాడు. ఇండో స్పిరిట్ లిమిటెడ్ సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నందున ఎల్1 లైసెన్స్ అప్లికేషన్స్‌లో సమస్యలు తలెత్తాయని చెప్పాడు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా తాను చేస్తానని అతడితో కవిత తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో మీటింగ్స్ నిర్వహించారు” అని ఈడీ తన చార్జ్‌షీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించింది.
సీఎం చంద్రశేఖర్‌రావు కూతురుగా ప్రస్తావన
సౌత్ గ్రూప్ లీడ్ చేస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని సమీర్ మహేంద్రు కలిశాడని, ఈ క్రమంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు కూతురుగా కవిత పేరును పిళ్లై ప్రస్తావించాడని ఈడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కవిత తరఫున ప్రతినిధిగా మీటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమీర్‌తో పిళ్లై అన్నట్లు వెల్లడిచింది. మాగంటి శ్రీనివాస్ రావుకు ప్రతినిధిగా ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారని, ఇందులో రామచంద్రపిళ్లై 65% వాటాలపై డీల్ కుదుర్చుకున్నారని పేర్కొంది. ‘‘గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలోని తాజ్ మన్‌సింగ్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌లో పెర్నడ్ రిచర్డ్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట పాల్గొన్నారు” అని వివరించింది.
అభిషేక్ నుంచి హవాలా డబ్బు
‘‘విజయ్ నాయర్ గ్రూప్‌లోని సికందర్ మన్, విరాట్‌మన్‌తో కలిసి రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్‌పల్లి ఢిల్లీలో పలు మీటింగ్స్ నిర్వహించారు. సౌత్ గ్రూప్‌లోని పొలిటిషియన్స్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కవిత.. లిక్కర్ బిజినెస్‌లో ఎలాంటి సహాయం కావాలన్న చేస్తారని వారు వివరించారు. తర్వాత హైదరాబాద్‌లో పలు మీటింగ్స్ జరిగాయి. ఇందులో 8 నుంచి 10 జోన్లకు సంబంధించిన బిడ్స్‌పై డిస్కషన్ జరిగింది. 20% స్టాక్ కోసం తమ షాపుల్లో స్పేస్ ఇచ్చేందుకు సికందర్ మన్, విరాట్ మన్ అంగీకరించారు. దీంతో రూ.20 కోట్ల నుంచి 30 కోట్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు. డబ్బులు తరిలించేందుకు దినేష్ అరోరా హవాలా ప్లాన్ చేశారు” అని చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ‘‘హవాలా సొమ్ము కోసం అభిషేక్ రావు బోయిన్‌పల్లిని ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మ, సుధీర్ కాంటాక్ట్ చేశారు. అభిషేక్‌రావు సోదరుడి ద్వారా కరెన్సీ నోట్, నంబర్ ఆధారంగా హవాలా రూపంలో ఈ ఇద్దరు డబ్బు కలెక్ట్ చేసుకున్నారు. డబ్బు అందిన తర్వాత దినేశ్ అరోరాకు రాజేశ్ శర్మ, సుధీర్ సమాచారం అందించారు. ట్రాన్సాక్షన్ పూర్తి అయినట్లు వెల్లడించారు. ఈ డబ్బును ఢిల్లీ బెంగాలీ మార్కెట్‌లోని సంజయ్ హవాలా ట్రేడర్స్ వద్ద విజయ్‌నాయర్ కలెక్ట్ చేసుకున్నారు’’ అని పూర్తి వివరాలను చార్జ్‌షీట్‌లో ఈడీ వివరించింది. ఈ బలమైన ఆధారాలతో కవితకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
మీటింగ్స్‌లో కవిత భర్త అనిల్
బంజారాహిల్స్‌లోని కవిత ఇంట్లో సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్‌పల్లి మీటింగ్ నిర్వహించారని, ఈ మీటింగ్‌లో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నారని చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. ‘‘మీటింగ్ డిస్కషన్‌లో రామచంద్ర పిళ్లైని తమ ఫ్యామిలీ మెంబర్‌గా కవిత చెప్పుకొచ్చారు. తనకు సంబంధించిన వ్యాపారాలను రామచంద్ర నిర్వహిస్తారని సమీర్తోఆమె అన్నారు. అన్ని రాష్ట్రాల్లో తమ వ్యాపారాలు ఉన్నట్లు చెప్పారు. ఇంకా వ్యాపారాలను విస్తరిస్తున్నామని వెల్లడించారు. ఇండో స్పిరిట్స్ కు వచ్చిన ఎల్1 లైసెన్స్ ద్వారా లిక్కర్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని వివరించారు” అని ఈడీ తెలిపింది. ఢిల్లీలోని సమీర్ మహేంద్రు ఇంట్లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు మూడు సార్లు మీటింగ్ నిర్వహించారని, పిళ్లైతో పాటు అభిషేక్ బోయిన్‌పల్లి, బుచ్చిబాబు, విజయ్‌నాయర్ జూమ్ కాల్స్‌లో కూడా మీటింగ్స్ చేపట్టారని ఈడీ వివరించింది. ఇండియా స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ దేశమంతా లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తున్నదని, సౌత్ గ్రూప్‌కు 65 శాతం వాటాలు ఇచ్చే విధంగా విజయ్‌నాయర్, సమీర్ ఒప్పందం చేసుకున్నారని, పార్ట్‌నర్‌షిప్ గురించి పేపర్స్ రాసుకున్నారని చార్జ్‌షీట్‌లో ఈడీ ప్రస్తావించింది.