మెదక్, వెలుగు: సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలని, ఆ దిశగా స్టూడెంట్స్శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మెదక్ వెస్లీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ను శుక్రవారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రయోగాలైనా మంచికి ఉపయోగపడేవిగా ఉండాలన్నారు. స్టూడెంట్లలో దాగి ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ప్రభత్వం ఏటా ఇలాంటి సైన్స్ ఫెయిర్లను ఏర్పాటు చేస్తోందన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. టీచర్స్ స్టూడెంట్లలో దాగి ఉన్న నైపుణ్యాలను, సృజనాత్మకతను వెలికి తీసి వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. డీఈవో రాధాకిషన్ మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రం మహా సముద్రం లాంటిదని, ఎంత నేర్చుకున్నా తక్కువే నన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ స్టూడెంట్స్ఎగ్జిబిట్లను తిలకించారు. సైన్స్ఫెయిర్ లో వివిధ విభాగాల్లో మొత్తం 337 ఎగ్జిబిట్లను జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల స్టూడెంట్స్ ప్రదర్శించారు. ఎంఈవో నీలకంఠం, డీఎస్వో రాజిరెడ్డి, ఏఎంవో సుదర్శన మూర్తి పాల్గొన్నారు.