- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
మోత్కూరు, వెలుగు: ప్రైవేట్ స్కూల్స్ లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో భాగంగా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని హైస్కూల్ లో బుధవారం మండల స్థాయి క్రీడాకారుల సెలక్షన్స్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కూడా ప్రభుత్వ స్కూల్ లోనే చదువుకున్నానని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు, విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రాజకీయ నాయకులు, టీచర్లు, తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవడానికి తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలని కోరారు. తన ఊరు మాదాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ.20 లక్షలతో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తునట్టు తెలిపారు.
పాఠశాలలో నెలకొన్న సమస్యలపై హెచ్ఎం టి.గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ మల్లన్నకు వినతిపత్రం అందజేశారు. హెచ్ఎం తీపిరెడ్డి గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవితలక్ష్మీ నర్సింహారెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ జి.లక్ష్మీ నర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు పాల్గొన్నారు.