అమెరికాలో కరోనా టీకా సక్సెస్

అమెరికాలో కరోనా టీకా సక్సెస్

న్యూయార్క్: కరోనా మహమ్మారి పనిపట్టే ఓ పవర్ ఫుల్ టీకా తయారీ దిశగా తాము కీలక విజయం సాధించామని అమెరికాకు చెందిన మోడెర్నా అనే బయోటెక్నాలజీ కంపెనీ వెల్లడించింది. మనుషులపై ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేశామని, తమ టీకా చాలా బాగా పనిచేసిందని ఆ కంపెనీ ప్రకటించింది. ‘‘ట్రయల్స్ లో భాగంగా, మార్చి నెలలో 8 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు రెండు డోసుల చొప్పున టీకా ఇచ్చాం. వారిలో కొన్ని రోజులకు కరోనాకు వ్యతిరేకంగా ఇమ్యూన్ సిస్టం యాక్టివేట్ అయి యాంటీబాడీలు తయారయ్యాయి. ఆ యాంటీబాడీలను ల్యాబ్ లో హ్యూమన్ సెల్స్ లో ఉంచి ప్రయోగం చేయగా, అవి కరోనా వైరస్ కణాలు రెప్లికేషన్ కాకుండా పూర్తిగా అడ్డుకున్నాయి. కరోనా వైరస్ సోకి, కోలుకున్న వ్యక్తుల్లోని యాంటీబాడీలతో ఇవి కూడా సరిగ్గా మ్యాచ్ అయ్యాయి.”అని మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టాల్ జాక్స్ వెల్లడించారు. తర్వలో తాము సెకండ్ ఫేజ్ లో 600 మందిపై, వచ్చే జూలైలో థర్డ్ ఫేజ్ లో వేలాది మందిపై ట్రయల్స్ చేయనున్నట్లు తెలిపారు. సెకండ్ ఫేజ్ ట్రయల్స్ కు ఇప్పటికే ఎఫ్ డీఏ ఆమోదం కూడా పొందామన్నారు. అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివరినాటికి లేదా 2021 మొదట్లో టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ట్రయల్స్ అన్నీ పూర్తయితే, లక్షల కొద్దీ డోసుల వ్యాక్సిన్ తయారీకీ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

లో డోసు టీకానే బెస్ట్..

ఫస్ట్ ఫేజ్ హ్యూమన్ ట్రయల్స్ లో వాలంటీర్లకు లో, మీడియం, హై డోసు టీకాలను ఇచ్చి ప్రయోగాలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ టాల్ జాక్స్ వెల్లడించారు. లో, మీడియం డోసు టీకాల ద్వారానే ఫస్ట్ ఫేజ్ లో మంచి ఫలితాలు వచ్చాయని జాక్స్ చెప్పారు. లో, మీడియం డోసుల వల్ల వాలంటీర్లలో ఒకరికి మాత్రమే టీకా ఇచ్చిన చోట ఎర్రగా కందిపోయి, పుండుగా మారినట్లు అయిందన్నారు. హై డోసు ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు మాత్రం జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి వచ్చి, ఒకరోజు తర్వాత తగ్గిపోయాయని తెలిపారు. ఈ టీకా లో డోసులోనే బాగా పనిచేస్తున్నందున, ఇకపై హై డోసును వాడబోమని పేర్కొన్నారు. దీనివల్ల ఎక్కువ మొత్తంలో టీకాలను తయారు చేసేందుకూ వీలవుతుందన్నారు.

భారత్ లో లక్ష దాటిన కరోనా కేసులు