అమెరికాలో మోడీ సభకు ట్రంప్

అమెరికాలో మోడీ సభకు ట్రంప్

ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే వేదిక పైకి రానున్నారు. ఈనెల 22న హ్యూస్టన్ లో భారతీయ అమెరికన్లతో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోడీ, ట్రంప్ పాల్గొంటారు. Howdy MOdi అనే కార్యక్రమానికి ట్రంప్ హాజరవుతున్నట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. ఈ కార్యక్రమం కోసమే ట్రంప్ ప్రత్యేకంగా హ్యూస్టన్ వెల్లనున్నట్లు తెలిపింది. భారత అమెరికా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో ముందడుగు పడనుంది. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ, ట్రంప్ మాట్లాడనున్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యాక ప్రవాస భారతీయులతో మోడీ మాట్లాడడం ఇదే తొలిసారి. హ్యూస్టన్ లోని NRG స్టేడియంలో జరిగే సమావేశంలో దాదాపు 50 వేల మంది NRIలు పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహిస్తోంది. షేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్ థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యూఎస్, ఇండియా మధ్య మరింత బలమైన బంధానికి ఈ కార్యక్రమం వేదిక అవుతుందని వైట్ హౌజ్ తెలిపింది.

మోడీ టూర్ షెడ్యూల్ ఇదీ

ప్రధాని మోడీ ఈనెల 21న అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. మొదట హ్యూస్టన్ వెళ్లి ఆ తర్వాత 23 నుంచి 27 వరకు న్యూయార్క్ లో పర్యటించనున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఈనెల 27న మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగిస్తారు. అమెరికన్ ప్రధాన కంపెనీల సీఈవోలతో మోడీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది.