ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ. 3 లక్షల కోట్ల ఆదాయం!

ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ. 3 లక్షల కోట్ల ఆదాయం!
  • 5 శాతం శ్లాబు 7 శాతానికి.. 18 శాతం శ్లాబు 20 శాతానికి పెంపుదల
  • ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ. 3 లక్షల కోట్ల ఆదాయం!
  • రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికి కసరత్తు

వెలుగు బిజినెస్​ డెస్క్​: శ్లాబులలో మార్పు ద్వారా జీఎస్​టీ ఆదాయం ఏటా మరో రూ. 3 లక్షల కోట్లు పెరిగేలా కమిటీ ప్రపోజ్​ చేసినట్లు సీనియర్​ అధికారి ఒకరు వెల్లడించారు. 5 శాతం శ్లాబును 7 శాతానికి, 18 శాతం శ్లాబును 20 శాతానికి పెంచాలని జీఎస్​టీ కౌన్సిల్​ ఏర్పాటు చేసిన కమిటీ తన ప్రపోజల్స్​లో చెప్పినట్లు పేర్కొన్నారు. అదనంగా వచ్చే జీఎస్​టీ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు పంచుకుంటాయి. పెట్రోలు, డీజిల్​లపై ఇటీవల ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈ లోటును పూడ్చు కోవడానికి జీఎస్​టీ శ్లాబుల రేటు పెంపుదల సాయపడుతుంది. వెల్ఫేర్​ స్కీముల కోసం మరింత వెచ్చించే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి దొరుకుతుంది. వచ్చే ఏడాది జూన్​ నుంచి రాష్ట్రాలకు కేంద్రం  ఇస్తున్న జీఎస్​టీ కాంపెన్సేషన్​ నిలిచిపోనుంది. దీంతో వాటికీ ఈ అదనపు ఆదాయం అండగా మారనుంది. ఆదాయ వనరులు తగినంతగా లేక చాలా రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి.

మెరిట్​ రేటు 6 శాతమైతే అదనంగా  రూ. 50 వేల కోట్లు... 

గుజరాత్​, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్​, ఉత్తర ప్రదేశ్​ వంటి రాష్ట్రాలు భారీగా జీఎస్​టీ కాంపెన్సేషన్​ను పొందుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కొవిడ్​–19 సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​తో ఖర్చులు పెరగడం వల్ల అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలూ   చిక్కుల్లో పడ్డాయి. రెవెన్యూ తగినంతగా రాక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఖర్చుకూ–ఆదాయానికీ మధ్య లోటు పూడ్చడానికి అదనంగా అప్పులు చేసే పరిస్థితీ లేదు. వ్యక్తిగత ఇన్​కంటాక్స్​ రేట్లు, పెట్రోల్​–డీజిల్​లపై ఎక్సైజ్​ డ్యూటీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  తగ్గించింది. ఇక ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ముందున్న ఒకే మార్గం జీఎస్​టీ పెంచడమని ఆ ప్రభుత్వాధికారి చెప్పారు. జీఎస్​టీ 5 శాతం శ్లాబును (మెరిట్​ రేటు) 6 శాతానికి పెంచితే ఏటా అదనంగా రూ. 40 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్లు సమకూరుతుందని పేర్కొన్నారు. చాలా ఎసెన్షియల్ ఐటమ్స్​పై ఈ మెరిట్​ శ్లాబునే విధిస్తున్నారు. 

ఏప్రిల్​ 1, 2022 నుంచి అమలులోకి తెండి....రాష్ట్రాల సూచన

విలువైన మెటల్స్​పై విధిస్తున్న జీఎస్​టీ రేటు, చిన్న వ్యాపారాలకు ఇస్తున్న కాంపెన్సేషన్​ స్కీము వంటి వాటి రివిజన్​ కూడా ఈ ప్రపోజల్స్​లో ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్​ 1 నుంచి జీఎస్​టీ కొత్త శ్లాబులను అమలులోకి తెస్తే మేలని కొన్ని రాష్ట్రాలు సూచిస్తున్నాయని పై ప్రభుత్వాధికారి వెల్లడించారు. జీఎస్​టీ శ్లాబుల రివిజన్​ ప్రపోజల్స్ వివరాల కోసం ఫైనాన్స్​ మినిస్ట్రీకి పంపిన ఈమెయిల్స్​కు జవాబు రాలేదని మింట్​ ఈ కథనంలో పేర్కొంది. 2017లో జీఎస్​టీని అమలులోకి తెచ్చిన తర్వాత చాలా వస్తువులపై పన్నును జీఎస్​టీ కౌన్సిల్​ తగ్గించింది. జీఎస్​టీ రాకతో పన్నుల వ్యవస్థలో ట్రాన్సపరెన్సీ బాగా పెరిగింది. కానీ, జీఎస్​టీ ప్రభావంతో    పరోక్ష పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి.

ఫైనల్​ డెసిషన్​ కాలేదు...

జీఎస్​టీ శ్లాబుల పెంపు విషయంలో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని మరో సీనియర్​ అధికారి చెప్పారు. కౌన్సిల్​ డిస్కషన్స్​లో ఈ అధికారి కూడా పాల్గొన్నారు. శ్లాబుల రేషనలైజేషన్​పై చర్చ జరుగుతోందని, అమలులోకి తేవాలంటే మరి కొంత స్టడీ అవసరమనే ఆలోచన కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. పెద్ద మార్పులు చేసేప్పుడు తొందరపడకూడదని చెప్పారు. మంత్రుల కమిటీ ఈ అంశాన్ని ఇంకా పరిశీలిస్తుండటంతో తన పేరును చెప్పడానికి ఈ అధికారి ఇష్టపడలేదు. జీఎస్​టీ శ్లాబుల మార్పు కోసం కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై నాయకత్వంలో ఒక కమిటీని జీఎస్​టీ కౌన్సిల్​ ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ మేరకు కొన్ని ప్రపోజల్స్​ను తయారు చేసి ఆ కమిటీకి శనివారం అందచేశారు.