పత్రికా స్వేచ్ఛను దెబ్బతీస్తే ఊరుకోబోం

పత్రికా స్వేచ్ఛను దెబ్బతీస్తే ఊరుకోబోం

న్యూఢిల్లీ: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా నెలకొన్న విషమ పరిస్థితుల్లోనూ మీడియా అందించిన సేవలను షా గుర్తు చేసుకున్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడులు చేస్తే ఊరుకోబోమన్నారు. ‘పత్రికా దినోత్సవ శుభాభినందనలు. మన మీడియా సోదరులు దేశాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగించే వాళ్లను వ్యతిరేకిస్తాం. కరోనా పరిస్థితుల్లో మీడియా అందించిన సేవలు చాలా మెచ్చుకోదగ్గవి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

అమిత్ షాతోపాటు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు కూడా జర్నలిస్టులకు శుభాకాంక్షలు చెప్పారు. ‘జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మీడియా ప్రొఫెషనల్స్‌‌ అందరికీ శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలోనూ, సాధికారత తీసుకురావడంలోనూ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. మహమ్మారి విజృంభణ సమయంలోనూ ప్రజలకు ఇన్ఫర్మేషన్ అందించడంలో కృషి చేసిన మీడియా మిత్రులు ప్రశంసలకు అర్హులు. పత్రికా స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదు. పత్రికా స్వేచ్ఛపై ఎలాంటి దాడి జరిగినా అది దేశ ఆసక్తుల మీద జరిగే దాడే. అలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.