మోడీ ప్రభుత్వ దురహంకారం .. పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసింది: ఖర్గే

 మోడీ ప్రభుత్వ దురహంకారం .. పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసింది: ఖర్గే

న్యూఢిల్లీ:  కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని మోడీపై దాడిని కాంగ్రెస్ మరింత తీవ్రం చేసింది. మోడీ ప్రభుత్వ దురహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ‘మీ ప్రభుత్వ దురహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసింది' అని ఖర్గే హిందీలో ట్వీట్ చేశారు.  పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కును భారత రాష్ట్రపతికి లేకుండా చేశారని, దీనిద్వారా 140 కోట్ల మంది భారతీయులకు మీరు ఏమి చూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు.  "ప్రజాస్వామ్య ఆత్మ"  లేని కొత్త భవనంలో తమకు విలువ లేదన్నారు. కాగా, లోక్‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించకపోతే తమ పార్టీ హాజరుకాదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. 

 “రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాంచీలోని జార్ఖండ్ హైకోర్టు కాంప్లెక్స్‌‌‌‌లో దేశంలోనే అతిపెద్ద న్యాయ ప్రాంగణాన్ని బుధవారం ప్రారంభించారు.  ఈ నెల 28న ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం రాష్ట్రపతికి రాజ్యాంగపరమైన ప్రత్యేక హక్కు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్‌‌‌‌ చేశారు. మరోవైపు ప్రతిపక్షాల బాయ్​కాట్ ​పిలుపు తర్వాత బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కూడా  ఎదురు దాడిని ప్రారంభించింది.  ప్రతిపక్షాల స్టాండ్ మనదేశ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు ఘోర అవమానంగా ఎన్డీయే మండిపడింది. 

‘పార్లమెంట్​’ ఓపెనింగ్​పై పిల్​..నేడు సుప్రీంలో విచారణ

కొత్త పార్లమెంట్​ బిల్డింగ్ ను ప్రధాని మోడీ ప్రారంభించడం రాజ్యాంగ ఉల్లంఘన అంటూ సుప్రీంకోర్టులో పిల్​ దాఖలైంది. నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవం ​రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగానే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది  సీఆర్ జయ సుకిన్​ పిల్​ దాఖలు చేశారు. ఈ పిల్ పై శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది.