
అమ్రోహా/సాహరణ్ పూర్ : ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ… కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీ లపై ఎదురుదాడి చేశారు. దేశాన్ని బోటి-బోటి(ముక్కలు ముక్కలు చేయడం) చేస్తామనేవాళ్లపై కాంగ్రెస్ వాళ్లు ప్రత్యేకమైన మమకారం ప్రేమ చూపిస్తారని విమర్శించారు మోడీ. అదే బీజేపీ నాయకులు… దేశపు ఆడబిడ్డల గౌరవం కాపాడేలా బేటీ – బేటీ అని నినదిస్తామని పంచ్ డైలాగులు విసిరారు.
2014లో కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ మసూద్ విద్వేషపు ప్రసంగాన్ని ప్రధాని మోడీ యూపీ ప్రచారంలో గుర్తుచేశారు. అప్పటి లోక్ సభ ఎన్నికలకు ముందు… ఆ కేసులో ఇమ్రాన్ మసూద్ అరెస్టై జైలుకు వెళ్లాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ వివాదానికి దూరంగా ఉంది. ఇపుడు సాహరణ్ పూర్ నుంచి పోటీలో ఉన్నాడు ఇమ్రాన్ మసూద్. ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ షెహజాదా రాహుల్ గాంధీ అమితమైన ప్రేమ చూపిస్తారని మోడీ విమర్శించారు.
ఉగ్రవాదులు పాతాళంలో ఉన్నా వదలం : మోడీ
అమ్రోహా సభలో బీఎస్పీ-ఎస్పీ పొత్తుపై విమర్శలు చేశారు మోడీ. ప్రతిపక్షాలు చూపించే సాఫ్ట్ కార్నర్.. ఉగ్రవాదులకు ఊతమిచ్చేలా ఉందన్నారు. ఉగ్రవాదులకు మోడీ అంటే ఏంటే తెలిసిందన్నారు. దాడులు చేసినవారు పాతాళంలో ఉన్నా సరే వెతికి మరీ వారి అంతుచూస్తామన్న సంగతి టెర్రరిస్టులకు తెలిసిందని చెప్పారు మోడీ.
దళితులను కాంగ్రెస్ ఏనాడు ఎదగనీయలేదని విమర్శించారు నరేంద్ర మోడీ. అంబేద్కర్ ను ఓడించాలని చూసి ఇపుడు ఓట్ బ్యాంక్ కోసం ఆయన పేరు తీసుకొస్తోందన్నారు. 1971 లో పాకిస్థాన్ కు భారత్ దీటైన రిప్లై ఇచ్చినప్పుడు… అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ కు క్రెడిట్ ఇవ్వకుండా.. ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పొగిడిందన్నారు.