చైనా పేరు పలకాలంటే మోడీకి భయం: కాంగ్రెస్

చైనా పేరు పలకాలంటే మోడీకి భయం: కాంగ్రెస్

ఆ దేశంతో సంబంధాలు ఉన్నందుకే ప్రస్తావించడం లేదా?: కాంగ్రెస్

దౌసా: ఇండియా–చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలపై పార్లమెంటులో చర్చించకుండా ప్రధాని నరేంద్ర మోడీ పారిపోతున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. చైనా పేరు పలకాలంటేనే మోడీ భయపడుతున్నారని ఆయన విమర్శించారు. చైనాతో సంబంధాలు ఉన్నందువల్లే చైనా పేరు పలకలేకపోతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం రాజస్థాన్ లోని దౌసాలో రమేశ్ మాట్లాడారు. బార్డర్​లో ఇండియా–చైనా మధ్య నెలకొన్న వివాదంపై తాము అడిగే ప్రశ్నలకు మోడీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్  సింగ్  జవాబు చెప్పాలని డిమాండ్  చేశారు. అరుణాచల్ ప్రదేశ్​లోని తవాంగ్ ఏరియాలో మన పోస్టును ఆక్రమించుకునేందుకు చైనాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

‘‘1986లో నాటి ప్రధాని రాజీవ్  గాంధీ బలగాలను పంపినప్పటి నుంచి యాంగ్ స్టీ ఏరియాలో మన దేశమే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇపుడు చైనీయులు అక్కడ కొత్త స్థావరాన్ని ఓపెన్  చేసే ధైర్యం చేశారు. అయినా కూడా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. 1962 యుద్ధం గురించే బీజేపీ ఎప్పుడూ మాట్లాడుతుంది. మరి 1967 నాటి సంగతేంటి? ఆ సంవత్సరం జరిగిన యుద్ధంలో మనోళ్లు చైనా వాళ్లను ఓడించారు. ఇక 1988లో రాజీవ్  గాంధీ చైనాకు వెళ్లి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేశారు. కానీ 2020 ఏప్రిల్ లో  ఆ సంబంధాలన్నీ ముగిసిపోయి కొత్త అధ్యాయం ఓపెన్  అయింది” అని జైరాం పేర్కొన్నారు.