మోదుగు అందాలు.. చూడటానికి వేయి కళ్లు చాలవు

మోదుగు అందాలు.. చూడటానికి వేయి కళ్లు చాలవు

వేసవి కాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో మోదుగ పూలు విరివిగా పూస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అడవులు మోదుగు పూలతో కొత్త అందాలు సంతరించుకుంటాయి. ఈ సారి కూడా ఆదిలాబాద్ అటవీ ప్రాంతం మోదుగు పూలతో కాషాయమయమైంది. మిగతా చెట్లన్నీ ఎండిపోయి బోసిగా కనిపిస్తుంటే. మోదుగ పూలు మాత్రం సింధూర వర్ణంలో ధగధగ మెరిసిపోతున్నాయి. . రోడ్లకు ఇరువైపులా ఏపుగా పూసిన మోదుగ పూలు బాటసారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ పూలను ఆదిలాబాద్ లో గోగు పూలు అని పిలుస్తుంటారు.

మార్కెట్ లో దొరికే రకరకాల రంగులతో పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని ప్రజలు హోలీ పండగను జరుపుకుంటారు. కానీ ఇక్కడి ప్రజలు ప్రకృతిలో లభించే మోదుగు పూలతో రంగులు తయారు చేసి హోలీ ఆడుతుంటారు. మోదుగు పూలను నీళ్లల్లో వేసి ఉడికిస్తే ఆ నీళ్లు ఎర్రని రంగులోకి మారుతాయి. ఈ రంగు నీళ్లతోనే ఆదివాసీలు హోలీని జరుపుకుంటారు. 

ఈ పూలకు ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శివరాత్రి పండగ సమయంలో మోదుగ పూలతో శివునికి అలంకరణ చేస్తారు. గోగు, బూరుగు, రేల పూలను సేకరించి కొత్త కుండలో వాటిని మూడు రోజులపాటు నానబెట్టేవారు. అనంతరం ఆ పూల రంగులను చల్లుకుంటూ వసంతోత్సవం జరుపుకునేవారు. ఇలా చేస్తే శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. 

ఆరోగ్య పరంగా మోదుగు పూలు, ఆకులు, కొమ్మలను ఔషధంగా ఉపయోగించుకుంటున్నారు పల్లె ప్రజలు. వేసవి కాలంలో గోగు పూలను ఉడికించిన నీళ్లను తాగితే ఒంటికి చలవ చేస్తుందని చెబుతారు. వడదెబ్బ నివారణ, పిల్లల్లో నులిపురుగుల నివారణ, మూత్ర సంబంధిత వ్యాధుల నివారణకు మోదుగ పూలు చాలా ఉపయోగపడతాయని ఇక్కడివారి నమ్మకం. 

దూరం నుంచి చూస్తే కాషాయ రంగులో కనిపించే మోదుగపూలు.. దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లో అందంగా కనిపిస్తాయి. పూలతో తయారు చేసిన రంగు బట్టలపై పడితే అసలే పోదు. పసుపు రంగు మోదుగ పూల చెట్ల కింద పడుకుంటే కంటి నిద్ర పడుతుందని ఇక్కడి ప్రజులు చెబుతున్నారు. 

మోదుగ ఆకులతో విస్తారాకులు తయారు చేసి.. వాటిని శుభ కార్యాల్లో వాడుతారు. 

మోదుగ పూలకు సాహిత్యంలో  కూడా ప్లేస్ ఉంది. దాశరథి కృష్ణమాచార్య మోదుగు పూలు అనే నవలను రాశారు. ఇతర కవులు, రచయితలు మోదుగ పూలకు తమ రచనల్లో స్థానం కల్పించారు.