ఉద్యోగాలు, పరిహారం ఇస్తేనే భూములిస్తం.. ఎన్టీపీసీకి న్యూ మొఘల్పహాడ్గ్రామస్తుల షరతు

ఉద్యోగాలు, పరిహారం ఇస్తేనే భూములిస్తం.. ఎన్టీపీసీకి న్యూ మొఘల్పహాడ్గ్రామస్తుల షరతు

గోదావరిఖని, వెలుగు: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌‌ స్టేజ్‌‌–2లో భాగంగా నిర్మించనున్న 2,400 మెగావాట్ల విద్యుత్‌‌ ప్లాంట్‌‌కు అవసరమైన యాష్‌‌ పాండ్‌‌ కోసం భూసేకరణపై సోమవారం అంతర్గాం మండలం న్యూ మొఘల్‌‌ పహాడ్‌‌ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. 

ఈ సమావేశంలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. గ్రామస్తులు మాట్లాడుతూ, 1982లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు సరైన నష్టపరిహారం అందలేదన్నారు. ఎన్టీపీసీ సంస్థ కారణంగా గ్రామం నష్టపోయినా ఇప్పటివరకు గ్రామ అభివృద్ధికి సంస్థ నుంచి పెద్దగా సాయం అందలేదని విమర్శించారు.

మొత్తం 606 ఎకరాల సీలింగ్‌‌ భూములకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, గ్రామంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌‌ చేశారు. అలాగే సీఎస్‌‌ఆర్‌‌ ద్వారా గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య మాట్లాడుతూ, గ్రామస్తుల సమస్యలు, వినతులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.