- అక్రమాలపై కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు
- బీజేపీ కామారెడ్డి ఇన్‌చార్జి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి టౌన్‌తో పాటు నియోజకవర్గంలోని ఆయా చోట్ల భూములకు సంబంధించిన అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా.. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యమేమిటని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టౌన్‌లోని సర్వే నంబర్ 6 అబాదీ భూమి, అడ్లూర్- కామారెడ్డి మధ్య 22 ఎకరాల భూమి కబ్జాపై కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మేలో ఈ అక్రమాలను తాను బయట పెట్టానని, వీటిపై ఆఫీసర్లకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. కానీ, కలెక్టర్ ఇప్పటి వరకు కబ్జాకు గురవుతున్న భూముల పరిశీలన, వాటిపై ఎంక్వైరీ, ఆఫీసర్లతో మాట్లాడడం కానీ చేయలేదన్నారు. అక్రమాలపై చర్య తీసుకోకపోవడంతో పాటు, ప్రజలు, బాధితులతో మాట్లాడేందుకు టైం లేని కలెక్టర్‌కు తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి శివారులోని అబ్దుల్నగర్లో రూల్స్‌కు విరుద్ధంగా వెంచర్‌కు పర్మిషన్ఇచ్చి లీడర్ ఇంటికి మాత్రం వెళ్లేందుకు టైం ఉందని ఎద్దేవా చేశారు. అక్రమాలకు కలెక్టర్ మద్దతు ఇస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. పోలీసులు కూడా సివిల్ విషయాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తేలు శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ విపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, లీడర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
నవీపేట్, వెలుగు: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని వికలాంగుల పోరాట సమితి నేషనల్ ప్రెసిడెంట్ సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో వికలాంగుల దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడారు. 2007లో మంద కృష్ణ మాదిగ ఈ కమిటీని స్థాపించి నేటికి 15 ఏళ్లు అయ్యిందన్నారు. అర్హులందరికీ దళిత బంధు, ట్రై సైకిళ్లు ఇతర లోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రెసిడెంట్ గంగాధర్, ఎమ్మార్పీఎస్ స్టేట్ లీడర్ మనికొల్ల గంగాధర్, సతీశ్, ప్రభాకర్, విజయ పాల్గొన్నారు.
లొంకల్‌పల్లిలో చిరుత సంచారం
లింగంపేట, వెలుగు: మండలంలోని లొంకల్‌పల్లి, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల శివార్లలో చిరుత సంచరించడంతో ఇరు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. లొంకల్‌పల్లి శివారులో మార్గం రాజు వరి పొలంలో ఆదివారం ఉదయం చిరుత పాదముద్రలను గుర్తించారు. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత నెలలో శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన కంపె రాజు మేకల మందపై చిరుత దాడి చేసి రెండు మేకలను హతమార్చింది. తాజాగా చిరుత పంట పొలాలలోకి రావడంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఫారెస్టు ఆఫీసర్లు స్పందించి బోను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు అండగా ఉంటాం
మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
భిక్కనూరు(బీబీపేట), వెలుగు: రైతులకు తమ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ చెప్పారు. ఆదివారం బీబీపేటతో పాటు మండలంలోని ఇస్సానగర్, ఉప్పరిపల్లి, మాల్కాపూర్, యాడారం, జనగామ గ్రామల్లో ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పీఎం కేసీఆర్ రాష్ట్రం అంటే కేవలం నాలుగు నియోజకవర్గాలే అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాలేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అందరినీ నట్టేటముంచాడని ఆరోపించారు. అటు కేంద్రం గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసరాల సరుకుల ధరలు, కరెంట్, బస్ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, మద్ద చంద్రకాంత్‌రెడ్డి, భీమ్‌రెడ్డి, భూమాగౌడ్, సుతారి రమేశ్, స్వామి పాల్గొన్నారు.
