బర్త్ డే నాడే ప్రాణాలు కోల్పోయాడు

బర్త్ డే నాడే ప్రాణాలు కోల్పోయాడు

గోదావరిఖని, వెలుగు : రెండేండ్ల వయస్సులో ఆ యువకుడి తండ్రి, అన్న రోడ్డు యాక్సిడెంట్​లో చనిపోయారు. దీంతో మిగిలిన ఒక్కగానొక్క కొడుకును తల్లి  అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. సోమవారం కొడుకు పుట్టిన రోజు కావడంతో సంతోషంగా ఉంది. కానీ, అంతలోనే అతడి చావు వార్త విని శోకసంద్రంలో మునిగిపోయింది. మంచిర్యాల జిల్లా కేంద్రం రాంనగర్‌‌కు చెందిన బానోతు వంశీకృష్ణ నాయక్‌‌ (20) డిగ్రీ సెకండియర్‌‌ చదువుతున్నాడు. సోమవారం తన 20వ పుట్టిన రోజు కావడంతో సినిమా చూసేందుకు వెళుతున్నానని తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. మంచిర్యాల నుంచి బైక్​పై పెద్దపల్లి వైపు బయలుదేరాడు. ఉదయం 11 గంటల టైంలో బైక్ ​అదుపు తప్పడంతో రామగుండం సమీపంలోని అంతర్గాం పీఎస్ ​లిమిట్స్​రాజీవ్‌‌ రహదారిపై రైల్వే ఓవర్‌‌ బ్రిడ్జి దగ్గర డివైడర్‌‌ను ఢీకొట్టాడు. దీంతో వంశీకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గోదావరిఖని సర్కారు దవాఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఓవర్​స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్​మార్టం తర్వాత డెడ్​బాడీని సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం గర్జనపల్లికి తరలించారు. 

2003లో ప్రమాదం నుంచి బయటపడ్డ వంశీ.. 

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేసే బానోత్‌‌ రతన్‌‌ నాయక్‌‌, నిర్మల దంపతులకు సాయికృష్ణ, వంశీకృష్ణ కొడుకులు. కుటుంబమంతా 2003లో తిరుపతికి కారులో వెళ్తుండగా కడప జిల్లా నీల కంఠేశ్వరం వద్ద జరిగిన యాక్సిడెంట్‌‌ లో తండ్రి రతన్‌‌ నాయక్‌‌, అన్న సాయికృష్ణ చనిపోయారు. ఆ టైంలో వంశీకృష్ణ వయస్సు రెండేండ్లు కాగా, యాక్సిడెంట్​ నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పటినుంచి అతడి తల్లి గారాబంగా పెంచింది. సోమవారం యాక్సిడెంట్‌‌లో ఉన్న కొడుకు కూడా చనిపోవడంతో నిర్మలను ఆపడం ఎవరితరం కావడం లేదు.