ఈఎస్ఐ స్కాంలో.. రూ.200 కోట్లకుపైగా హవాలా.!

ఈఎస్ఐ స్కాంలో.. రూ.200 కోట్లకుపైగా హవాలా.!
  • మాజీ డైరెక్టర్‌‌ దేవికారాణితో పాటు పలువురిని ప్రశ్నించిన ఈడీ
  • 2021లోనే రూ.144 కోట్ల ఆస్తులు జప్తు చేసిన​ అధికారులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్‌‌ఐ ఇన్సూరెన్స్‌‌ మెడికల్  స్కీమ్‌‌ (ఐఎంఎస్) స్కామ్‌‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రూ.200 కోట్లకు పైగా మనీలాండరింగ్‌‌  జరిగినట్లు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌  డైరెక్టరేట్‌‌ (ఈడీ) అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఐఎంఎస్‌‌  మాజీ డైరెక్టర్‌‌  దేవికారాణితో పాటు ఇతర నిందితులను మంగళ, బుధవారం విచారించి కీలక వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఐఎంఎస్‌‌  స్కామ్‌‌కు సంబంధించి2019 సెప్టెంబర్‌‌‌‌లో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన 8 ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.

 2015 నుంచి 20-19 మధ్య కాలంలో మందులు, మెడికల్‌‌  కిట్ల కొనుగోళ్ల పేరుతో రూ.211 కోట్ల నిధులు గోల్‌‌మాల్‌‌ జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్‌‌ కేసులు నమోదు చేసింది. ఐఎమ్‌‌ఎస్‌‌ మాజీ డైరెక్టర్  దేవికారాణి, మాజీ జాయింట్‌‌  డైరెక్టర్ కలకుంట్ల పద్మ, ఫార్మాసిస్ట్‌‌  నాగలక్ష్మి, షెల్‌‌ కంపెనీల క్రియేటర్‌‌‌‌  శ్రీధర్‌‌‌‌ బాబు, పి.రాజేశ్వర్‌‌ ‌‌రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌‌, బెంగళూరు, నోయిడా, చెన్నైలోని131ప్రాపర్టీస్‌‌లో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు,19 బిజినెస్  ఔట్‌‌లెట్లను గుర్తించారు. 2021 నవంబర్‌‌‌‌లో నిందితులకు చెందిన రూ.144.40 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తుల్ని జప్తు చేశారు. దేవికారాణితో పాటు నిందితుల పెట్టుబడులు, బిజినెస్‌‌ల వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఆస్తులను గుర్తించారు.  పీఎంజే జువెల్లర్స్‌‌లో కొనుగోలు చేసిన రూ6.28 కోట్ల విలువైన బంగారు ఆభరణాల తాలూకు డాక్యుమెంట్లు సేకరించారు.