
- పూర్తిగా తగ్గిన వర్షాధార పంటల విస్తీర్ణం
- వర్షాధార పంటలు 2500 ఎకరాలే
- కోతుల బెడదతో పూర్తిగా తగ్గిన సాగు
యాదాద్రి, వెలుగు: వర్షాధార పంటల సాగు ఏటా తగ్గుతోంది. కందులు, పెసర్లు, జొన్న వంటి పంటల సాగు వైపు రైతులు చూడడం లేదు. ప్రధానంగా కోతులు, అడవి పందుల కారణంగానే ఈ పంటల సాగు తగ్గుతోంది. యాదాద్రి జిల్లాలో సాగుకు అనువైన భూమి దాదాపు 8 లక్షల ఎకరాలు ఉంది. తోటలు అన్ని పంటలు కలిపి దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా సాగులో ఉన్నాయి. ఇందులో వరి సాగు ఎక్కువగా చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. వాస్తవానికి గతంలో జిల్లాలో వర్షాధార పంటలను సాగు చేసేవారు. ఇందులో ప్రధానంగా కంది, పల్లి, జొన్నలు, పెసర్లు, పొద్దు తిరుగుడు, కొన్ని చోట్ల చెరకును రైతులు సాగు చేసేవారు.
కోతుల బెడదే కారణం
జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. జిల్లావ్యాప్తంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2021-–22లో నిర్వహించిన సర్వేలో జనాభాతో కోతులు పోటీ పడుతున్నాయని తేలింది. అప్పట్లో జిల్లా జనాభా 7.94 లక్షలు ఉండగా కోతుల సంఖ్య 5.17 లక్షలు ఉన్నాయని తేలింది. అయితే వర్షాధార పంటల పై కూడా కోతుల బెడత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా జిల్లాలో పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ఎక్కడ సాగు చేసినా కోతుల మంద పంటలపై పడి పీకి పాడు చేస్తున్నాయి. దీనికి తోడు అడవి పందుల బెడద తీవ్రంగానే ఉంది. పంటలను తొక్కి పడేస్తున్నాయి. ఈ పంటలను సాగు చేయాలంటే తప్పనిసరిగా కాపలా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాపలా ఉన్నా.. కోతుల బెడద అరికట్టలేని స్థితిలో ఉంది.
2500 వేల ఎకరాలకే పరిమితం
వేల ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఇప్పుడు వందల పదుల సంఖ్యలో సాగు చేస్తున్నారు. ప్రధానంగా కంది సాగుపై ఎఫెక్ట్ ఎక్కువగా పడుతోంది. గతంలో 40 వేల ఎకరాల వరకూ రైతులు కంది పంట సాగు చేశారు. ఈ సీజన్లో 6 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా వేయగా కేవలం 2200 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. జొన్న 600 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తే కేవలం 50 ఎకరాల్లో సాగు చేశారు. పెసర్లు 135 ఎకరాలు సాగు చేశారు. మొక్కజొన్న 32 ఎకరాలు, చెరుకు 4 ఎకరాలు, రాగులు 2 ఎకరాల మాత్రమే సాగు చేశారు. ఆయిల్ సీడ్స్ మొత్తంగా 500 ఎకరాల్లో సాగు చేస్తారని భావిస్తే ఒక్క ఎకరా కూడా సాగులోకి రాలేదు.
వర్షాధార పంటలు తగ్గడానికి ఇతర కారణాలు
వానలు సకాలంలో కురవకపోవడం, నీటి లభ్యత తగ్గడం వంటివి వర్షాధార పంటల సాగును ప్రభావితం చేస్తున్నాయి. దీంతో లాభదాయకమైన వాణిజ్య పంట అయిన పత్తి వైపు రైతులు ఆసక్తి
చూపుతున్నారు.
సాగుకు అవకాశముంది:
వర్షాధార పంటల సాగు తగ్గిపోతోంది. కందులు, జొన్న తక్కువగా సాగు చేస్తున్నారు. మిగిలిన పంటల జోలికి పోవడం లేదు. సన్ ప్లవర్, సెనగలు, ఉలవలు, పల్లి సాగు చేయడానికి ఇంకా సమయం ఉంది. రైతులు ఆయా పంటలను సాగు చేసుకోవాలి.- నీలిమ, డీఏవో, యాదాద్రి