తెలంగాణలో వానాకాలం సాగు కోటి 27 లక్షల ఎకరాలు

తెలంగాణలో  వానాకాలం సాగు కోటి 27 లక్షల ఎకరాలు

 

  • 62 లక్షల ఎకరాల్లో  వరి.. 45 లక్షల ఎకరాల్లో పత్తి
  • ఈ సారి సాగు లక్ష్యంలో 96 శాతం పూర్తి
  • 10.55 లక్షల ఎకరాలతో టాప్ లో నల్గొండ జిల్లా
  • 10 జిల్లాల్లో వందశాతం దాటేసిన పంటల సాగు
  • సర్కార్​కు వ్యవసాయ శాఖ నివేదిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం సాగు 1.27 కోట్ల ఎకరాలకు చేరింది. ఈ సీజన్​లో సాధారణ సాగు టార్గెట్ 1.34 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటికే 96 శాతం లక్ష్యం సాధించిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, 62.27 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సారి వరి సాగు మరింత పెరిగే అవకాశం ఉందని అగ్రికల్చర్​ఎక్స్​పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వానాకాలం ప్రారంభంలో మే నెలలో వర్షాలు కురిసినప్పటికీ, ఆ తర్వాత నెలన్నర రోజుల పాటు వానలు ముఖం చాటేయడంతో సాగు మందగించింది. జూన్​లో వర్షాలు సరిగా కురువక పంటల సాగుకు ప్రతికూలంగా మారాయి. జులై నెలాఖరు, ఆగస్టు ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి. ఈ సీజన్​లో వరి సాగుతో పాటు పత్తి, మొక్కజొన్న వంటి పంటల సాగు గణనీయంగా జరిగింది. ఈ నెలాఖరు నాటికి సాగు టార్గెట్ దాటే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సీజన్​ పంటల్లో టాప్​లో వరి సాగు

ఈ వానాకాలం సీజన్‌‌‌‌ లో పంటల సాగు ఇప్పటి వరకు 1.27 కోట్ల ఎకరాలు దాటేయగా.. ఇందులో వరి 62.27లక్షల ఎకరాలలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత పత్తి పంట 45.47 లక్షల ఎకరాలతో రెండో స్థానంలో ఉంది. రికార్డు స్థాయిలో మక్కలు 6.27 లక్షల ఎకరాలు, కంది 4.78 లక్షల ఎకరాలు, సోయా 3.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. పెసర 61వేల ఎకరాలు, జొన్న 34,611 ఎకరాల్లో సాగు కాగా, మినుములు 23 వేల ఎకరాలు, ఇతర పంటలు 30 వేల ఎకరాల్లో సాగయ్యాయి. 

వానకాలం సాగులో టాప్​గా నల్గొండ జిల్లా

రాష్ట్రంలో వానాకాలం సాగులో 10.50 లక్షల ఎకరాలతో నల్గొండ టాప్​లో నిలిచింది. ఈ జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో పత్తి, 4.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అలాగే, 7.28 లక్షల ఎకరాలతో సంగారెడ్డి రెండో స్థానంలో, 6.27 లక్షల ఎకరాలతో ఖమ్మం జిల్లా మూడో స్థానంలో ఉంది. ఆ తరువాత ఆదిలాబాద్​ 5.79 లక్షల ఎకరాలతో నాలుగో స్థానంలో ఉండగా ఆ తరవాత స్థానాల్లో నిజామాబాద్​ (5.52 లక్షల ఎకరాలు),  సూర్యాపేట (5.43 లక్షల ఎకరాలు), కామారెడ్డి (5.43 లక్షల ఎకరాలు), 5.37 లక్షల ఎకరాలతో వికారాబాద్ జిల్లాలు వరుస స్థానాల్లో నిలిచినట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది.

21 జిల్లాల్లో ఎక్సెస్​ వర్షపాతం

జులై 20 వరకు 25 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవడంతో సాగు వెనకబడింది. విత్తనాలు, మొలకలు ఎండిపోవడంతో రైతులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, జులై నెలాఖరు నుంచి కురిసిన వానలు సాగు పుంజుకునేలా చేశాయి. గత నెల రోజుల్లోనే  పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని పంటలు సాగయ్యే 32 జిల్లాల్లో  21 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. మరో 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఫలితంగా దాదాపు అన్ని జిల్లాల్లో పంటల సాగు 100 శాతానికి చేరువైయ్యాయి. 10 జిల్లాల్లో వందశాతం సాగును దాటేశాయి. ఇటీవల కురిసన వర్షాలు రైతుల్లో ఆశలు రేకెత్తించాయని, సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అగ్రికల్చర్ నిపుణులు పేర్కొన్నారు.