
గోవర్ధనపురంలో గోవర్ధనుడు, మురళీధరుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్లు. వాళ్లు సిద్ధయ్య స్వామి ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. వాళ్లకి ఎవరూ లేరు.. వాళ్లకి ఏ పనిలోనూ నిలకడ ఉండదు. దాంతో చదువు సగంలోనే మానేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడ ధర్మ సత్రంలో ఉంటూ తమకు లేని జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ, తెలియని విద్యను తెలిసినట్టు నటిస్తూ ఉండేవాళ్లు. అక్కడి ప్రజలకు జ్యోతిషం, వాస్తు, భవిష్యత్తు మొదలగునవి చెప్తామని పండిత వేషధారణ ధరించి మోసం చేయసాగారు! అన్నయ్య గోవర్ధనుడు తమ్ముడితో ఒకరోజు ‘‘మురళీధర మనం చేసేదే తప్పు. పైగా మన నోటికొచ్చింది చెప్పడం అంత మంచిది కాదేమో అనిపిస్తోంది!’’ అన్నాడు.
అందుకు తమ్ముడు ‘‘అన్నయ్యా.. నువ్వు ఏమి కంగారుపడకు మనకి పాండిత్యం వచ్చో రాదో ఎదుటి వాళ్లకు తెలియదు కదా? మనం ఏదో ఒకటి ఊహించి చెప్పేద్దాం నువ్వు మాట్లాడకుండా ఉండు" అని అన్నయ్యని వారించాడు. కొంతకాలం గడిచింది డబ్బులు బాగానే సంపాదించారు. ‘‘నువ్వు ఏమైనా చెప్పు, ఇది మంచి పద్ధతి కాదు. ఇది పాపం.. ఈ పని చేయొద్దు. నాకు మనస్కరించడం లేదురా ఆపేద్దాం.. ఇక నావల్ల కాదు’’ అన్నాడు గోవర్ధనుడు.
‘‘సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం’’ అన్నాడు తమ్ముడు కానీ మనసులో ‘‘అన్నయ్యకు ఈ పని చేయటం ఇష్టం లేదు. ఇకమీదట ఆ విధంగా చేయొద్దు అంటున్నాడు. కాబట్టి ఈ పని మీద వచ్చిన డబ్బులు అన్ని నేను దాచేసి, పోయాయి అని చెప్తాను’’ అనుకుని వెంటనే వాటిని తీసుకెళ్లి ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టాడు.
మరుసటి రోజు అన్నయ్యకు డబ్బులు కనిపించకపోవడంతో తమ్ముడిని అడగా ‘‘పోయాయి’’ అని అబద్ధం చెప్పాడు. దానికి అన్నయ్య గోవర్ధనుడు ‘‘ఆ డబ్బులు పోతే పోనీ ఈ ఊరిలో ఉన్న శాంత ముని దగ్గరకు వెళ్లి విద్య నేర్చుకుందాం’’ అన్నాడు అన్న.
మురళీధరుడు రోజూ ఉదయాన్నే బయటకు వెళ్లి ఊరి చివరి చెట్టు కింద డబ్బులు చూసుకుని వస్తూ ఉండేవాడు. శాంత ముని దగ్గరకు రమ్మంటే ఈ రోజు వస్తా.. రేపు వస్తా.. అంటూ దాటవేయసాగాడు. ఒకరోజు ఉదయాన్నే బయటకు వెళ్లి వస్తున్న తమ్ముడిని చూసి ‘‘రోజు ఉదయాన్నే ఎక్కడికి వెళ్లి వస్తున్నావు’’ అని అడగగానే ‘‘ఎక్కడకి కాదు నదికి వెళ్లి స్నానం చేసి వస్తున్న’’ అని అబద్ధం ఆడాడు మురళీధరుడు. కానీ తమ్ముడి మాట మీద అనుమానం కలిగింది.
మరుసటి రోజు ఉదయం తమ్ముడికి తెలియకుండానే అన్న అనుసరించాడు. కొంత దూరం వెళ్లాక ఒక చెట్టు చాటు నుండి తమ్ముడిని గమనించసాగాడు. మర్రి చెట్టు కింద తవ్వి సంచిని బయటకు తీసి కొంత డబ్బులు తీసుకుని మరల అక్కడే పెట్టేశాడు. గోవర్ధనుడికి అర్థమైంది ‘‘డబ్బులు ఉన్నాయి కాబట్టి విద్య నేర్చుకోడానికి రావట్లేదు’’ అని సాయంత్రం తమ్ముడిని పిలిచి ‘‘ఏరా డబ్బులు పోయాయా? లేదా నువ్వు ఊరి చివర మర్రిచెట్టు కింద దాచావా? నాకు అనుమానంగా ఉంది’’ అన్నాడు. అన్నమాటలకు తమ్ముడు ‘‘నన్ను క్షమించు అన్నయ్య.. నేను నీకు అబద్ధం చెప్పాను’’ అని పశ్చాత్తాప పడ్డాడు.
అప్పుడు గోవర్ధనుడు తమ్ముడితో ‘‘చూడు మురళీధర మనకు రాని విద్యతో ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాం. అదే పెద్ద తప్పు. దానికితోడు దుర్బుద్ధితో డబ్బులు పోయాయని నాకు అబద్ధం చెప్పావు. ఆశ ఉండాలి కానీ, అత్యాశ కాదు ఏదైనా మనకి అవసరమైనంత వరకే ఉంచుకోవాలి. అవసరానికి మించి ఉంటే దానివల్ల అనర్థాలు జరుగుతాయి. ప్రతి వ్యక్తి మంచి, చెడులను గ్రహించి పాపభీతి కలిగి ఉండాలి. అది మనిషి మనసును కంట్రోల్ చేస్తుంది’’ అని తమ్ముడికి హితబోధ చేశాడు. తరువాత అన్నదమ్ములిద్దరూ శాంత ముని దగ్గరకు వెళ్లి విద్యను అభ్యసించి, సంపూర్ణ జ్ఞానం పొందారు.
–కళ్లేపల్లి ఏడుకొండలు–