కొవిషీల్డ్‌‌తోనే ఎక్కువ యాంటీబాడీస్

కొవిషీల్డ్‌‌తోనే ఎక్కువ యాంటీబాడీస్
  •     వ్యాక్సిన్లు తీసుకున్న హెల్త్ సిబ్బందిపై  స్టడీలో వెల్లడి
  •     కొవిషీల్డ్ తీసుకున్నవారిలో 98%, కొవాగ్జిన్ తీసుకున్నవారిలో 80% మందిలో యాంటీబాడీస్
  •     టీకా వేసుకున్నాక పాజిటివిటీ రేటు కొవిషీల్డ్‌‌లోనే ఎక్కువ
  •     కొవాగ్జిన్ తీసుకున్నాక 2.2%, కొవిషీల్డ్ వేసుకున్నాక 5.5% కేసులు

న్యూఢిల్లీ:భారత్‌‌‌‌లో తయారవుతున్న వ్యాక్సిన్లు రెండూ కరోనాను ఎదుర్కోవడంలో మంచి ఇమ్యూన్ రెస్పాన్స్‌‌‌‌ను డెవలప్ చేయగలుగుతున్నాయని, అయితే కొవాగ్జిన్  కంటే కొవిషీల్డ్ తీసుకున్న వారిలోనే ఎక్కువ యాంటీబాడీలు జనరేట్ అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. కొవిషీల్డ్ తీసుకున్నవారిలో 98.1 శాతం మందికి, కొవాగ్జిన్ ‌‌‌‌ తీసుకున్నవారిలో 80 శాతం మందికి యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని  వెల్లడైంది. కోల్‌‌‌‌కతాలోని జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇన్‌‌‌‌స్టిట్యూట్, అహ్మదాబాద్‌‌‌‌లోని విజయరత్న డయాబెటిస్ సెంటర్, ధన్‌‌‌‌బాద్‌‌‌‌లోని డయాబెటిస్ అండ్ హార్ట్ రీసెర్చ్ సెంటర్, జైపూర్‌‌‌‌‌‌‌‌లోని రాజస్థాన్ హాస్పిటల్, మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్ కలిసి ఈ స్టడీ చేశాయి. దేశంలోని 13 రాష్ట్రాల్లో 22 సిటీలకు చెందిన 515 మంది డాక్టర్లు, నర్సుల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని రీసెర్చర్లు టెస్ట్ చేశారు. ఏ వ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్న వారిలో యాంటీబాడీలు, యాంటీ స్పైక్ యాంటీబాడీలు ఎంత మేరకు ఉత్పత్తి అయ్యాయి? వాటి సంఖ్య ఎంత ఉంది? అన్న అంశాలను పరిశీలించామని జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌కు చెందిన డాక్టర్ అవదేశ్ కుమార్ సింగ్ తెలిపారు.

యాంటీబాడీ లెవెల్‌‌‌‌ రెండింతలు పైనే

మొత్తం 515 మందిలో 95 శాతం మందికి యాంటీబాడీలు జనరేట్ అయ్యాయని అవదేశ్ చెప్పారు. అయితే కరోనా వచ్చి తగ్గిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 100 శాతం మందిలో యాంటీబాడీలు జనరేట్ అయ్యాయని, అది కూడా నార్మల్‌‌‌‌గా ఉన్న వాళ్లకంటే ఎక్కువ మోతాదులోనేనని పేర్కొన్నారు. ‘‘స్టడీలో పాల్గొన్న వారిలో 425 మంది కొవిషీల్డ్ తీసుకోగా, 90 మంది కొవాగ్జిన్  తీసుకున్నారు. అయితే ఇందులో కొవిషీల్డ్ తీసుకున్నవారిలో 98.1 శాతం మందికి, కొవాగ్జిన్ ‌‌‌‌ తీసుకున్న వారిలో 80 శాతం మందికి యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయి. కొవిషీల్డ్ తీసుకున్నాక మిల్లీ లీటర్ రక్తంలో యాంటీబాడీస్‌‌‌‌ 127 యూనిట్స్ ఉంటే, కొవాగ్జిన్ ‌‌‌‌ తీసుకున్న వారిలో 53 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. కొవిషీల్డ్‌‌‌‌ తీసుకున్న వారిలో 2.3 రెట్లు ఎక్కువ యాంటీబాడీలు జనరేట్ అవుతున్నాయి” అని అవదేశ్ తెలిపారు. 

షుగర్ ఉన్నోళ్లలో తక్కువే

ఈ స్టడీలో పాల్గొన్న వారిలో వయసుల వారీగా చూస్తే 60 ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారికే ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఎక్కువ బరువు, ఇతర జబ్బులు ఉన్నవారిలో ఇమ్యూనిటీ రెస్పాన్స్‌‌‌‌లో పెద్దగా తేడా లేదు. కానీ డయాబెటిస్ సమస్య ఉన్నవారిలో మాత్రం యాంటీబాడీస్‌‌‌‌ తక్కువగానే ఉత్పత్తి అయ్యాయని స్టడీలో తేలింది. 

వ్యాక్సిన్ తీసుకున్నాక 4.9% పాజిటివిటీ

వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా రాదని చెప్పలేమని, అయితే వచ్చినా సీరియస్ కండిషన్‌‌‌‌ వరకూ వెళ్లే పరిస్థితి ఉండదని రీసెర్చర్లు తెలిపారు. ఈ స్టడీలో పాల్గొన్నవారిలో 4.9% మంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారని చెప్పారు. కొవాగ్జిన్ తీసుకున్న వారిలో 2.2% మందికి, కొవిషీల్డ్ తీసుకున్న వారిలో 5.5% మందికి రెండు డోసులూ వేయించుకున్న తర్వాత కూడా వైరస్ సోకిందన్నారు.