HMDAలో ప్రతి ఫైల్​కు ఒక రేటు! : సీఎల్ యూ సర్టిఫికెట్ల జారీలో అవినీతి

HMDAలో  ప్రతి ఫైల్​కు ఒక రేటు! : సీఎల్ యూ సర్టిఫికెట్ల జారీలో అవినీతి
  • హెచ్​ఎండీఏలో వెలుగులోకి మరిన్ని అక్రమాలు
  • సీఎల్ యూ సర్టిఫికెట్ల జారీలోనూ భారీగా అవినీతి!
  • బయో కన్జర్వేషన్​ జోన్​ నుంచి కమర్షియల్, రెసిడెన్షియల్​ కు మార్పు
  • దరఖాస్తుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు  
  • మాజీ డైరెక్టర్ అవినీతిపై అధికారుల్లో తీవ్ర చర్చ  
  • సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఆఫీసర్లు  
  • త్వరలోనే  హెచ్ఎండీఏ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్, వెలుగు :
 హైదరాబాద్​మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​అథారిటీ(హెచ్ఎండీఏ)లో అవినీతి గుట్ట కదులుతుంది. సంస్థ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏసీబీ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. శివ బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిపైనా అధికారుల్లోనూ చర్చనీయాంశమైంది. డబ్బు ముట్టజెప్పితేనే కానీ.. పని జరగని పరిస్థితిని ఆయన కల్పించారంటూ చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ కావడంతో ఆయన చెప్పిందే శాసనంగా కొనసాగిందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. ఆయన చెప్పిన పని చేయని అధికారులను బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సీఎల్‌‌యూ ( చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) భూముల మార్పిడికి సంబంధించిన దరఖాస్తుల్లో భారీగా అవినీతి జరిగినట్టు హెచ్‌‌ఎండీఏ అధికారులు గుర్తించారు. సీఎల్‌‌యూ నిమిత్తం వచ్చిన అప్లికేషన్ల నుంచి రూ. కోట్లలో డబ్బులు దండుకున్నారని.. ఎంతలా అంటే.. ప్రతి దరఖాస్తుకు రేటు ఫిక్స్​చేసి మరీ వసూలు చేశారనే ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి.  

జీవో 111 భూముల్లోనే ఎక్కువ  గోల్​మాల్!

హెచ్ఎండీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూముల మార్పులు కొందరు అధికారులకు కాసుల వర్షం  కురిపించిందనే వాదనలు లేకపోలేదు.  ముఖ్యంగా జీవో 111 పరిధిలోని భూములు బయో కన్జర్వేషన్ జోన్‌‌లో ఉండగా, వాటిని కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్‌‌లోకి మార్చినట్లుగా సమాచారం. ముఖ్యంగా వట్టి నాగులపల్లిలో వందల కోట్ల విలువైన భూములను జీవో 111 నుంచి తొలగించి కమర్షియల్, రెసిడెన్షియల్​జోన్​లోకి అక్రమంగా మార్చినట్టు తెలిసింది. ఏసీబీ తనిఖీల్లో ఇది బయటపడినట్టు హెచ్‌‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణ జరుగుతున్నట్టు సమాచారం. మరికొందరు ప్లానింగ్ అధికారులపైనా వేటు వేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు  సీఎం రేవంత్‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఆయన స్పందన తర్వాత అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌‌ఎండీఏ భావిస్తోంది. కాగా అధికారుల సమావేశంలోనూ భూములను కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్‌‌లోకి మార్చిన హెచ్‌‌ఎండీఏ ప్లానింగ్ అధికారులపై హెచ్‌‌ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సంస్థలో జరిగే పరిణామాలతో త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. అందులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఆదేశించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

సీఎల్ యూకు భారీగా వస్తున్న దరఖాస్తులు

హెచ్​ఎండీఏ పరిధిలో చేంజ్​ఆఫ్​ల్యాండ్​యూజ్​(సీఎల్ యూ) సర్టిఫికెట్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. గత బీఆర్​ఎస్​ సర్కార్ జీవో 111ను ఎత్తి వేయడంతో ల్యాండ్​కన్వర్షన్​ కోసం రియల్టర్లు, రియల్​ఎస్టేట్​వ్యాపారులు సీఎల్ యూకు అప్లికేషన్లు చేస్తున్నట్టు చెప్పారు.  ప్రస్తుతం హెచ్‌‌ఎండీఏ మాస్టర్‌‌ప్లాన్‌‌లో భాగంగా ఒక జోన్ నుంచి మరో జోన్‌‌లోకి మార్పు చేయాలంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్యూజ్ (సీఎల్‌‌యూ) మస్ట్ గా ఉండాలి. ఇందుకు హెచ్‌‌ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ మంత్రి నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలుపుతుంది. అయితే ఇందులో 100 నుంచి 150 సీఎల్ యూ దరఖాస్తులకు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్​శివబాలకృష్ణ హయాంలోనే అనుమతులు ఇచ్చారని తెలుస్తోంది.