మైహోమ్ సిమెంట్స్​లో..తవ్వేకొద్దీ అక్రమాలు

మైహోమ్ సిమెంట్స్​లో..తవ్వేకొద్దీ అక్రమాలు
  •     113 ఎకరాల భూదాన్ భూములు  కబ్జా
  •     గత సర్కారు హయాంలో ఆక్రమణ, నిర్మాణాలు
  •     కాంగ్రెస్ సర్కారు రావడంతో మారిన సీన్ 
  •     రేపు సీసీఎల్ఏలో ఎంక్వైరీకి రావాలని నోటీసులు
  •     కీర్తి సిమెంట్​ఫ్యాక్టరీకి సైతం తాఖీదులు
  •     కూల్చివేతలకు ఆఫీసర్లు రెడీ 

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలోని మైహోమ్ సిమెంట్​ఫ్యాక్టరీలో అక్రమాలు బయటపడుతున్నాయి. గత బీఆర్ఎస్​ సర్కారు అండతో ఫ్యాక్టరీ యాజమాన్యం వంద ఎకరాలకు పైగా భూదాన్​భూములను కబ్జా చేయడంతో పాటు అనుమతిలేకుండా నిర్మాణాలు చేపట్టిందనే ఆరోపణలు వచ్చాయి. కానీ, నాటి ప్రభుత్వ సహకారం ఉండడంతో అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ​సర్కారు అధికారంలోకి రావడంతో భూదాన్​ భూముల కబ్జా సంగతి తేల్చాలని ఆఫీసర్లను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. 

దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు.. ప్రాథమిక సర్వే అనంతరం మైహోం, కీర్తి సిమెంట్​ఫ్యాక్టరీలు భూములను కబ్జా చేయడమే కాకుండా  అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. సీసీఎల్​ఏకు నివేదిక పంపారు. ఇప్పటికే  రెండు ఫ్యాక్టరీలకు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో శనివారం సీసీఎల్ఏలో ఎంక్వైరీ జరగనుండగా, యాజమాన్యాల వివరణ ఆధారంగా అక్రమాలు నిజమని భావిస్తే భూదాన్ ​భూముల్లో  కట్టడాలను కూల్చేందుకు రెవెన్యూ ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు. 

156 ఎకరాల భూదాన భూములు కబ్జా

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని సర్వే నంబర్​1057లో 156 ఎకరాల భూదాన్​ భూమి ఉంది. ఇందులో 113 ఎకరాలు మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ, 40 ఎకరాలు కీర్తి సిమెంట్ ఫ్యాక్టరీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించాయనే ఆరోపణలున్నాయి. మైహోమ్ సిమెంట్స్​కబ్జా చేసిన 113 ఎకరాల్లో పవర్ ప్లాంట్ నిర్మించినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిని  సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు అవి భూదాన్​ భూములేనని 2016లో తీర్పు చెప్పింది. 

స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. కానీ, వారు పట్టించుకోకపోవడం, నిర్మాణాలు కొనసాగడంతో ఓ అడ్వొకేట్​మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2023లో మళ్లీ ఆదేశాలిచ్చింది. కానీ, ఆ భూములను ధరణిలో నమోదు చేయించి పట్టాలు పొందాలని రెండు ఫ్యాక్టరీల యాజమాన్యాలు ప్రయత్నించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దరఖాస్తు చేసుకోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత అప్లికేషన్​ను పరిశీలించిన కలెక్టర్​ పట్టాలు ఇవ్వడం కుదరదని రిజెక్ట్ చేశారు.

అక్రమాలపై దృష్టి సారించిన సర్కారు  

కాంగ్రెస్​సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మై హోమ్, కీర్తి సిమెంట్ ఫ్యాక్టరీల భూ ఆక్రమణలపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్​ ఆదేశాలతో రంగంలోకి దిగిన సూర్యాపేట జిల్లా రెవెన్యూ అధికారులు ఇటీవల ప్రాథమిక సర్వే చేశారు. 156 ఎకరాల భూదాన్​భూముల్లో మైహోమ్స్​ సిమెంట్ ​ఫ్యాక్టరీ 113 ఎకరాలు, కీర్తి సిమెంట్ ఫ్యాక్టరీ 18.20ఎకరాలు, కీర్తి సిమెంట్స్ ఎండీ జాస్త్రి త్రివేణి 21.20ఎకరాలను ఆక్రమించారని నిర్ధారణకు వచ్చారు. మరో ఇద్దరు రైతుల నుంచి 3.19ఎకరాలను కబ్జా చేశారని గుర్తించారు.

  మైహోం సిమెంట్ ఫ్యాక్టరీ ఆక్రమించిన భూదాన్ భూముల్లో ఫాక్టరీ యూనిట్-4 కు సంబంధించిన ఫ్యాబ్రికేషన్ యార్డ్ కూడా నిర్మించారని తేల్చారు. ఈమేరకు జిల్లా అధికారుల నుంచి సీసీఎల్​ఏకు నివేదిక అందడంతో ఇటీవల రెండు ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చారు. వెంటనే ఆక్రమించిన భూదాన్ భూములను ఖాళీ చేయాలని, లేదంటే ఈనెల 16న సీసీఎల్ఏ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. వాళ్లు ఇచ్చేవివరణ ఆధారంగా తదుపరి చర్యలకు ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు.