కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభం : హరీష్ రావు

కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభం : హరీష్ రావు

కేసీఆర్ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణమని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో  కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు...  పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారుల మధ్య వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కారణ జన్ముడు కేసీఆర్ అని కొనియాడారు. కానే కాదు, రానే రాదు అన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించాడని మంత్రి కొనియాడారు.

రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమన్న ఆయన... తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేలా కేసీఆర్ కృషి చేశారని హరీష్ రావు చెప్పారు. బడ్జెట్ లో రైతు బంధు కోసం కేసీఆర్ రూ.65వేల కోట్లు కేటాయించారని.. అభివృద్ధిలో, సంక్షేమంలో కేసీఆర్ తెలంగాణను ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభమని హరీష్ రావు అన్నారు.