40 ఏండ్లు పైబడినోళ్లు ఐటీ జాబ్స్ మానేస్తున్నరు

40 ఏండ్లు పైబడినోళ్లు ఐటీ జాబ్స్ మానేస్తున్నరు
  • ఒక్కో కంపెనీలో 20% మంది రాజీనామాలు!
  • పెరిగిన పని ఒత్తిడి, టార్గెట్లతో విసిగిపోయి బయటికి
  • రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఇతర బిజినెస్‌‌ల వైపు చూపు

హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్‌‌వేర్ జాబ్.. పేరులో ఉన్నంత ‘సాఫ్ట్‌‌’గా ఉండదు..! జీతం బాగొచ్చినా.. పని ఒత్తిడి, టెన్షన్లు, టార్గెట్లు, టైమ్‌‌కు మించిన డ్యూటీలతో.. ‘బాబోయ్ ఈ ఉద్యోగం వద్దు ఇక’ అనే పరిస్థితికి చేరుకుంటున్నరు టెకీలు. ఐటీకి టాటా చెప్పి.. ఇంకో ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో చేసుకుంటున్నరు. ఇలా రాజీనామాలు చేస్తున్న వాళ్ల సంఖ్య రెండు మూడేండ్లుగా పెరిగిపోతున్నది. ఇందులో 40 ఏండ్లు పైబడిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు.

కరోనా తర్వాత మరింత దెబ్బ

సర్కారు కొలువుల తర్వాత ఎక్కువ మంది కోరుకునే ఉద్యోగం ఐటీ ఫీల్డ్‌‌లోనే. కలర్‌‌‌‌ఫుల్ లైఫ్, మంచి జీతాలు, వీకెండ్ సెలవులు ఉంటాయని కొత్తగా అటువైపు వెళ్లే ఫ్రెషర్స్ అనుకుంటారు. ఇందుకు తగ్గట్లుగానే ఈ జాబ్స్‌‌కు భారీ డిమాండ్ ఉంటుంది. కంపెనీలు కూడా తమ అవసరాలను బట్టే ఎంప్లాయిస్‌‌‌‌‌‌‌‌ను నియమించుకుంటాయి. కరోనా టైంలో ఫ్రెషర్స్‌‌‌‌‌‌‌‌ని విపరీతంగా హైర్ చేసుకున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఇతర కన్సల్టెన్సీల ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలిచ్చాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి కంపెనీలతో టైఅప్ చేసుకున్న స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు.. ఫ్రెషర్స్‌‌‌‌‌‌‌‌కే 30 వేల నుంచి జీతాలు ఇస్తున్నాయి. కానీ కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలయ్యాక.. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ల పని తీరు పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి అర్ధరాత్రి, తెల్లవారుజాము దాకా మీటింగ్‌‌‌‌‌‌‌‌లు, డిస్కషన్‌‌‌‌‌‌‌‌లతోనే సరిపోతున్నది. మరోవైపు ప్రాజెక్టులు అనుకున్న సమయంలో పూర్తిచేయాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ల నుంచి ఒత్తిడి విపరీతంగా ఉంటున్నది. వీటన్నింటితో సీనియర్ ఉద్యోగులు విసిగిపోతున్నారు.

ఉన్నోళ్లపై ఒత్తిడి

ప్రస్తుతం అమెరికాలో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు తగ్గిపోయాయి. ఆ ప్రభావం ఇక్కడి ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడింది. దీంతో ఆఫర్ లెటర్లు పంపిన వాళ్లను కూడా కంపెనీలు జాబ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకోవడం లేదు. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో క్రాస్ కటింగ్‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నాయి. దీంతో ఎంప్లాయిస్ సంఖ్య పడిపోతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో ముందు నుంచీ ఉన్న సీనియర్లపై అధిక ఒత్తిడి పడుతున్నది. ఎన్నో ఏళ్లుగా ఉంటూ టీం లీడ్, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ పొజిషన్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వాళ్లు ఈ ప్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తట్టుకోలేకపోతున్నారు. జీతాలను పెంచడంలోనూ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు జాప్యం చేస్తుండడంతో ఉద్యోగాల నుంచి వైదొలుగుతున్నారు. ఇలా రెండు మూడేండ్లుగా ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వాళ్లే ఈ నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో సంస్థలో 40 ప్లస్ ఏజ్‌‌‌‌‌‌‌‌లో రిజైన్ చేస్తున్న వాళ్లు 20 శాతం పైనే ఉంటున్నారని ఐటీ అండ్ ఎంట్రప్రెన్యూర్ ఫోరం ఫౌండర్ మెరుగు శ్రీధర్ చెప్పారు.

అర్ధరాత్రి దాకా మీటింగ్స్

ఇంటి నుంచి పనిచేసే సమయంలో ఎప్పుడు మీటింగ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నా.. టైంతో సంబంధం లేకుండా ఉద్యోగులు అటెండ్ అయ్యేవారు. ఆఫీసులో చేసే దాని కంటే రెండింతలు ఎక్కువ పని ఇస్తుండడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. వర్కింగ్ అవర్స్ పెరగడంతో స్ట్రెస్ ఎక్కువ అవుతున్నదని అనేకమంది ఉద్యోగులు చెబుతున్నారు. ఉదయం లాగిన్ అయితే రాత్రి దాకా మీటింగ్స్, క్లైంట్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌తోనే గడుపుతున్నామని చాలా మంది వాపోతున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ బేస్డ్ కంపెనీలతో కలిసి పనిచేసే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌‌‌‌‌‌‌‌తో మరింత ప్రెజర్ ఫీలవుతున్నారు. అక్కడికి, ఇక్కడికి టైమింగ్స్ వేరుకావడం, క్లైంట్స్ కోసం అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు మేల్కొని వర్క్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. 

ఇతర రంగాలవైపు

హైదరాబాద్ సిటీలో రెండు నుంచి మూడు వేల దాకా ఐటీ, సాఫ్ట్ వేర్ కంపెనీలున్నాయి. వీటిలో పనిచేసే  ఉద్యోగుల కొత్త కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ, వారిని ఎంట్రప్రెన్యూర్స్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు ఎంట్రప్రెన్యూర్ షిప్ ప్రోగ్రాంలను నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల వారు ఉద్యోగులుగా మాత్రమే ఉండిపోకుండా ఎంట్రప్రెన్యూర్స్​గా మారే అవకాశం ఉంటుంది. కానీ ఏ కంపెనీ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు తమ నైపుణ్యానికి తగిన విలువ ఇవ్వడం లేదని ఎంప్లాయిస్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నారు. ఎంత పని చేసినా.. తమకంటూ ఎలాంటి ఐడెంటిటీ ఉండటం లేదనే కారణాలతో రాజీనామా చేసి తమకు నచ్చిన రంగాల వైపు వెళ్లిపోతున్నారు. రియల్ ఎస్టేట్, ఆర్గానిక్ ఫార్మింగ్, డెయిరీ ఫామ్, గొర్రెల పెంపకం, ఎడ్యుకేషనల్ సెక్టార్ వంటి వాటిలో స్థిరపడుతున్నారు. ఇంకొందరు స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు పెట్టి ఫ్రీలాన్సర్లను ఇతర సంస్థలకు ప్రొవైడ్ చేస్తున్నారు.  

ఎక్కువ ఒత్తిడికి గురైతున్నరు

40 ఏండ్లు పైబడిన వారు పని ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. ఒక్కో సంస్థలో 20 శాతం మంది జాబ్ మానేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్, డెయిరీ, రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్, ఇతర వ్యాపారాల వైపు వెళ్లిపోయారు. కంపెనీలు తిరిగి మొదలయ్యాక కూడా వర్కింగ్ అవర్స్ తగ్గడం లేదు. ఉద్యోగులను తీసేస్తున్నారు. ఉన్నవారిపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకే ఉద్యోగులు విసిపోయి రాజీనామాలు చేస్తున్నారు.

- శ్రీధర్ మెరుగు, ఐటీ అండ్ ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోరం ఫౌండర్

రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లోకి

ఎనిమిదేండ్లు అమెరికాలో ఉండి ఐటీ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో పనిచేశా. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఇండియాకు వచ్చి వేరే  కొన్ని బిజినెస్‌‌‌‌‌‌‌‌లు చేశా. రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకున్నా. యూఎస్‌‌‌‌‌‌‌‌లో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు తగ్గిపోతే ఇక్కడి కంపెనీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. క్రాస్‌‌‌‌‌‌‌‌ కటింగ్‌‌‌‌‌‌‌‌లు చేసి ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారు. ఉన్నవారిమీద ఒత్తిడి పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉద్యోగాలకు రిజైన్ చేశారు. వేరే ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ల వైపు వెళ్లాలని చూస్తున్నారు. - కొండపల్లి పవన్ కుమార్ రెడ్డి, హైదరాబాద్

టెన్షన్స్‌‌తో విసిగిపోయా..

చిన్న వయసులోనే ఎంఎన్‌‌సీలో ఉద్యోగం వచ్చింది. 13 ఏండ్లలో చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ స్థాయికి వెళ్లాను. కానీ ఆ తర్వాత పనితో అలసిపోయినట్లుగా అనిపించింది. ప్రాజెక్ట్‌‌లు వస్తాయో రావో తెలియదు. వర్క్ ప్రెజర్ పెరిగింది. ఒక పొజిషన్‌‌లో ఉన్నప్పుడు ఎంతో మందికి సమాధానం చెప్పాలి. అందరూ పనిచేసేలా చూడాలి. అన్నీ చూసుకోవాలి. ఈ టెన్షన్స్ అన్నింటి వల్ల విసిగిపోయా. కనీసం మన పేరు కూడా అక్కడ ఎవరికీ తెలియదు. గుర్తింపులేని ఉద్యోగం చేస్తున్నామని అనిపించింది. ఫీల్డ్ మారాలని అనుకున్నా. డైరీ ఫామ్, షీప్ ఫామ్ గురించి ఆలోచించా. ఊర్లో కొంత పొలం కొన్నా. అందులో మల్బరి, శ్రీగంధం మొక్కలను నాటాం. డైరీ ఫామ్, గొర్రెల పెంపకం మొదలుపెట్టా.  

- ఆర్యన్ శ్రీనివాస్ యాదవ్, నిర్మల్