భూ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?

భూ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?
  •     జిల్లాలో 6 వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్​ 
  •     కలెక్టర్​పైనే సమస్యల పరిష్కార భారం 
  •     పని ఒత్తిడితో పట్టించుకోని అధికారులు  
  •     ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు  
  •     గ్రీవెన్స్​లో మెజారిటీ ఫిర్యాదులు భూములపైనే..

మంచిర్యాల, వెలుగు : బీఆర్ఎస్​సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ పుణ్యమాని జిల్లాలో భూసమస్యలు పేరుకుపోతున్నాయి. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నచిన్న తప్పుల సవరణకూ ఏండ్లు గడుస్తున్నాయి. దీంతో బాధితులు తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టరేట్​చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. పేదలు పిల్లల చదువులు, పెండ్లిళ్లు, హాస్పిటల్​ ఖర్చులు వంటి అత్యవసరాలకు భూములు అమ్ముకునే చాన్స్​లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా భూ సమస్యలు పరిష్కరించకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏండ్లుగా పరిష్కారం కాని సమస్యలు

గత ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళిన చేపట్టడం తెలిసిందే. రికార్డులను ఆన్​లైన్​ చేసే సమయంలో అనేక తప్పులు దొర్లాయి. తప్పుడు సర్వేనంబర్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, లావుని పట్టాలుగా నమోదయ్యాయి. పట్టాదారుల పేర్లు, ఫొటోల్లో తప్పులు నమోదయ్యాయి. డిజిటల్​ సైన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ తప్పులను సవరించి కొత్త పట్టాదారు పాస్​బుక్​లు జారీ చేయాలని కోరుతూ బాధితులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ధరణి పోర్టల్​లో అందుబాటులోకి తెచ్చిన టీఎం 33 మాడ్యుల్ ​ద్వారా ఇప్పటివరకు 35వేలకు పైగా దరఖాస్తులు వచ్చి నట్టు సమాచారం.

 వీటిలో 6వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయంటే అధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చు. ప్రతి చిన్న సమస్యను కలెక్టరే పరిష్కరించాల్సి రావడంతో ఫైల్స్ వేలాదిగా పేరుకుపోతున్నాయి. ఇతర పనుల ఒత్తిడి కారణంగా కలెక్టర్ ధరణి సమస్యలను పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. 

తొమ్మిదేండ్లు అవుతున్నా ఫలితం సున్నా..

కన్నెపల్లి మండలం కొత్తపల్లి శివారు సర్వే నంబర్లు 88, 89లోని 54 ఎకరాలను గ్రామానికి చెందిన 34 మంది పేదలు సాగు చేసుకుంటున్నారు. వారికి 2010లో ఐదో విడత భూ పంపిణీలో రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్స్, 1బీ రికార్డులు ఇచ్చారు. కానీ ఇది ఫారెస్ట్​ ల్యాండ్​ అని ఆ శాఖ అధికారులను రైతులు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఈ సమస్యపై 2014, 2015లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేయగా ఫారెస్ట్​, రెవెన్యూ జాయింట్​ సర్వేకు ఆదేశించారు. 

తర్వాత మంచిర్యాల కలెక్టర్, బెల్లం పల్లి ఆర్డీఓలకు పలుమార్లు కంప్లయింట్​ చేయడంతో ఐదుసార్లు జాయింట్​సర్వే నిర్వహించారు. ఇప్పటికి తొమ్మిదేండ్లు అవుతున్నా ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో రైతులు వేసిన పంటలను ఫారెస్ట్​ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. ఈ భూములను ఆన్​లైన్​లో నమోదు చేసి పట్టాదారు పాస్​బుక్​లు ఇవ్వాలని కోరుతూ బాధిత రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

బిడ్డ పెండ్లికీ భూమి అమ్ముకోలేక..

హాజీపూర్​ మండలం వేంపల్లికి చెందిన దూట దుర్గయ్యకు సర్వే నంబర్ 10/2లో 21 గుంటల భూమి ఉంది.తహసీల్దార్​ డిజిటల్​ సైన్ ​కాకపోవడంతో నిరుడు జూలైలో మీసేవలో దరఖాస్తు చేశాడు. ఈ ఏడాది జనవరి 22న గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేశాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్య ఖర్చులకు, బిడ్డ పెళ్లి కోసం భూమిని అమ్ముదామంటే డిజిటల్​ సైన్​ పెండింగ్​ ఉండడం వల్ల అమ్మడానికి వీలు కావట్లేదని వాపోతున్నాడు. కాసిపేట మండలం రేగులగూడకు చెందిన మడావి వీరుకు రేగులపల్లి శివారు సర్వే నంబర్​ 49/18లో 4 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. 

పట్టా భూమికి ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వ పట్టాదారు పాస్​బుక్​ రాలేదు. భీమిని మండలం వడాలకు చెందిన ఏల్పుల పోశయ్యకు గ్రామ శివారులోని సర్వేనంబర్​ 269/2లో ఎకరం 34గుంటల భూమి ఉంది. 2017లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఏల్పుల పోశయ్య అనే మరో వ్యక్తికి నాటి ప్రభుత్వ పాస్​బుక్ జారీ చేశారు. అసలు పట్టాదారుడైన ఏల్పుల పోశయ్య తనకు పాస్​ బుక్​ జారీ చేయాలని కోరుతూ ఆరేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 

అక్కడా, ఇక్కడా తిప్పుకుంటున్నరు..

  •     బెల్లంపల్లికి చెందిన దాసరి రవికుమార్​కు సంబంధించిన పట్టా భూమిని ధరణిలో లావుని పట్టాగా నమోదు చేశారు. దీనిని సవరించి పాస్​బుక్​ఇవ్వాలని కోరుతూ నిరుడు అక్టోబర్​లో టీఎం 33 మాడ్యుల్​లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయమై తహసీల్దార్​ఆఫీస్​కు వెళితే కలెక్టరేట్​కు పోవాలని, అక్కడికి పోతే మళ్లీ తహసీల్దార్​ ఆఫీస్​కు వెళ్లాలని తిప్పించుకుంటున్నారే తప్పా సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నాడు.  
  •     లక్సెట్టిపేటకు చెందిన తోట సత్తయ్యకు అదే మండలంలోని చెల్లంపేట శివారులో 6 ఎకరాల 26 గుంట భూమి ఉంది. 2012 నుంచి ఆన్​లైన్​లో రాకపోవడంతో నమోదు చేయాలని కోరుతూ ధరణి టీఎం 33 మాడ్యుల్​ ద్వారా మిస్సింగ్​సర్వే నంబర్​ కింద 2022లో దరఖాస్తు చేశాడు. తహసీల్దార్, ఆర్​ఐ తగిన ఆధారాలతో విచారణ జరిపి ఆర్డీఓకు రిపోర్టు పంపారు. అక్కడి నుంచి ఫైల్​ కలెక్టరేట్​కు చేరింది. అయితే ఫైల్​కవరింగ్​ లెటర్​లో తప్పులున్నాయని తిరిగి తహసీల్దార్​ ఆఫీస్​కు పంపించారు. ఆరు నెలల నుంచి ఈ ఫైల్​అక్కడే పెండింగ్ లో​ఉంది. అధికారులను అడిగితే స్పందించడం లేదని, వెంటనే ఫైల్​మూవ్​చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. 
  •     కోటపల్లి మండలం కోనంపేటకు చెందిన నీలం సుధాకర్​సర్వే నంబర్​357/1/8లో ఉన్న 35 గుంటల భూమి ధరణిలో మిస్సయింది. టీఎం 33 మాడ్యుల్​ ద్వారా మిన్సింగ్​ సర్వే నంబర్​ కింద దరఖాస్తు చేసుకున్నాడు. నెలలు గడుస్తున్నా పాస్​బుక్​ రాకపోవడంతో రెవెన్యూ ఆఫీసులు, కలెక్టరేట్​చుట్టూ తిరుగుతున్నాడు.  
  •     చెన్నూర్​కు చెందిన అక్కినపెల్లి సత్యనారాయణకు సంబంధించిన వ్యవసాయేతర భూమి (నాలా)ను వ్యవసాయ భూమిగా మార్చాలని కోరుతూ నిరుడు డిసెంబర్​లో దరఖాస్తు చేస్తున్నాడు. కలెక్టర్ బయోమెట్రిక్ పెండింగ్​ఉండడంతో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్​లో కలెక్టర్​కు దరఖాస్తు పెట్టుకున్నాడు.