
కొత్త టెక్నాలజీ రాకనో లేక ఐటీ కంపెనీల్లో ఆర్థిక సంక్షోభమో లేక కొత్త ప్రాజెక్టులు లేకనో.. రాబోయే ఆర్థిక మాంద్యానికి భయపడి అప్రమత్తం కావటమో ఏమో కానీ.. మొత్తానికి ఐటీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల కోత.. లే ఆఫ్స్ దారుణంగా ఉంటున్నాయి.. ఏ రోజు ఎవరి ఉద్యోగానికి మూడిందో అన్న భయం ఉద్యోగులను ఈ మధ్య కాలంలో తీవ్రంగా వేధిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు..
2024, జనవరి ఒకటో తేదీ నుంచి.. జూన్ నెల 21వ తేదీ నాటికి.. ప్రపంచ వ్యాప్తంగా 98 వేల 834 మంది ఐటీ ఉద్యోగం కోల్పోయారు.. ఆయా కంపెనీలు తీసివేశాయి. ఇవన్నీ కేవలం ఐటీ రంగంలో మాత్రమే.. అంటే రోజుకు 500 మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. వీళ్లల్లో కొత్తగా ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనేది లెక్కలోకి తీసుకోలేదు కానీ.. రోజుకు 500 మంది అయితే ఐటీ ఉద్యోగం కోల్పోతున్నారని డేటా చెబుతోంది.
కొంప ముంచుతున్న సైలెంట్ లే ఆఫ్స్:
ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ ( AIITEU ) ప్రకారం 2023లో సైలెంట్ లేఆఫ్స్ కింద సుమారు 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని తెలుస్తోంది. వాస్తవంగా వీరి సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 ఏడాది మొదటి 5నెలల్లో ఇండియాలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో సుమారు రెండు నుండి 3వేల మంది ఉద్యోగులు సైలెంట్ లేఆఫ్స్ వల్ల రోడ్డున పడ్డట్లు తెలుస్తోంది.
సైలెంట్ లేఆఫ్స్ అంటే, ఒక ఉద్యోగిని డైరెక్ట్ గా తీసేయకుండా 30రోజుల టైం ఇచ్చి తమ సంస్థలోనే ఇంకో ఉద్యోగానికి షిఫ్ట్ అవ్వమని చెప్పటం, ఆ 30రోజుల సమయంలో సదరు ఉద్యోగి వేరే ఉద్యోగానికి షిఫ్ట్ అవ్వకపోతే, డైరెక్ట్ గా టర్మినేట్ చేస్తుంది సంస్థ. ఒకసారి మన రిలీవింగ్ లెటర్ లో టర్మినేటెడ్ అని పడిందంటే ఇక బయట జాబ్ దొరకటం కష్టమే.ఒక్క ముక్కలో చెప్పాలంటే సైలెంట్ లేఆఫ్స్ అంటే పోమ్మనకుండా పొగబెట్టడం అని చెప్పచ్చు.