యాదాద్రికి ఖమ్మం వడ్లు.. సగానికి పైగా ఒక్క మిల్లుకే

యాదాద్రికి  ఖమ్మం వడ్లు.. సగానికి పైగా ఒక్క మిల్లుకే
  • 10 వేల మెట్రిక్​ టన్నులు అలాట్​మెంట్.. 
  • ఇందులో సగానికి పైగా ఒక్క మిల్లుకే!
  • మూసీ వడ్లు వద్దంటున్న మిల్లర్లు.. సెంటర్ల నిర్వాహకుల లోపాయికారి ఒప్పందం? 
  • బస్తాకు 42. 200 కిలోల చొప్పున తూకం

యాదాద్రి, వెలుగు : ఖమ్మం నుంచి యాదాద్రి జిల్లాకు 10 వేల మెట్రిక్​ టన్నుల వడ్లను అలాట్​మెంట్​ చేశారు. ఈ వడ్లలో సగానికిపైగా ఒక్క మిల్లుకే వస్తున్నాయి. జిల్లాలో వడ్ల కొనుగోలు విషయంలో వెనుకాముందాడుతున్న ఆఫీసర్లు ఖమ్మం జిల్లా వడ్లను మాత్రం వెంటనే అన్​లోడ్​ చేసుకుంటున్నారు. ఇందుకు కారణం యాదాద్రి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ముసీ నీటితో వరి పంట సాగు కావడమేనని తెలుస్తోంది. ఆ వడ్లను మరాడిస్తే  ఎక్కువగా నూకలు వస్తున్నాయని మిల్లర్ల వాదన. ఈ క్రమంలో  మిల్లర్లతో కొందరు  కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  

అందులో భాగంగానే బాస్తాకు రెండు కిలోలకు మించి తూకం వేయిస్తున్నట్టు తెలుస్తోంది.  యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్​లో మూడు లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఆరు లక్షల మెట్రిక్​ టన్నులకు మించి దిగుబడి రాగా అందులో ఐదు లక్షల మెట్రిక్​ టన్నులు కొనుగోలు చేస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. అయితే మార్చి 19న కొనుగోలు సెంటర్లను ప్రారంభించినప్పటికీ అకాల వర్షాల కారణంగా కొనుగోళ్లు స్లోగా సాగుతున్నాయి. ఈ నెలలో వానలు లేకున్నా మిల్లర్ల కారణంగా కొనుగోళ్లలో ఆలస్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 1.70 లక్షల మెట్రిక్​ టన్నులు వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు. 

ఖమ్మం వడ్లు కొంటున్రు.. 

యాదాద్రి జిల్లాకు చెందిన వడ్లను కొనుగోలు చేయచేయడం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న  ఆఫీసర్లు, ఖమ్మం  జిల్లాకు చెందిన వడ్లను మాత్రం దించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​చొరవతో యాదాద్రి జిల్లాకు వడ్లను అలాట్​ చేసినట్టుగా తెలుస్తోంది. యాదాద్రి జిల్లాలో  కొనుగోలు చేసే వడ్లను స్టాక్​ చేయడానికి రైస్​ మిల్లుల్లో స్థలం లేదంటుంటే ఇప్పుడు అదనంగా ఖమ్మం జిల్లా నుంచి 10 వేల మెట్రిక్​ టన్నులను ఇక్కడి రైస్​ మిల్లుకు అలాట్​చేయడం విస్మయం కలిగిస్తోంది. ఇందులో ఇప్పటికే సగానికి పైగా వడ్లు బీబీనగర్​ మండలంలోని స్టేట్​ రైస్​ మిల్లర్ ​అసోసియేషన్ ​లీడర్​కు చెందిన ఒక్క మిల్లులోనే అన్​లోడ్​ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మిల్లర్​కు బీబీనగర్​ మండలానికి చెందిన వడ్లను అలాట్​ చేస్తే తనకు వద్దని రామన్నపేట నుంచి వచ్చిన వడ్లను తీసుకుంటునట్లు సమాచారం. దీంతో బీబీనగర్​ రైతులు వడ్లను పక్క మండలాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మం వడ్లను దించుకోవడంపై ఆఫీసర్లకు ఫిర్యాదులు  చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. 

తోటి మిల్లర్ల విమర్శలు

ఖమ్మం నుంచి ఒక్క మిల్లుకే ఎక్కువ వడ్ల అలాట్​మెంట్​పై కొందరు మిల్లర్లు విమర్శలు చేస్తున్నారు. మిల్లర్​ అసోసియేషన్​ బాధ్యుడుగా ఉండి, అందరి కోసం పని చేయాల్సిన లీడరే స్టేట్​ లెవల్లో పరిచయాలున్న కారణంగా వ్యక్తిగతంగా లాభ పడుతున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలోని వడ్లపై కొర్రీలు పెడుతూ ఖమ్మం జిల్లా వడ్లను ఎక్కువగా అలాట్​ చేయించుకోవడం వ్యక్తిగతంగా లాభపడడం కోసం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు మిల్లర్ల కారణంగా మొత్తం వ్యవస్థపైనే విమర్శలు వస్తున్నాయని ఓ మిల్లర్​ తెలిపారు. 

మూసీ వడ్లను దించుకోవట్లే.. 

జిల్లాలో బీబీనగర్​, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో ఎక్కువగా మూసీ నీటితో వరిని సాగు చేస్తారు. దీంతో ఆయా మండలాలను చెందిన వడ్లు తమకు వద్దని, ఆ వడ్లను మరాడిస్తే నూక శాతం ఎక్కువగా వస్తుందని మిల్లర్లు దించుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇదే విషయమై కొందరు మిల్లర్లు తూకం విషయంలో రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. సెంటర్​లో వేసిన తూకానికి ఒప్పుకోకుండా మిల్లుకు వచ్చిన తర్వాత మరోసారి తూకం వేయిస్తున్నారు. వాస్తవానికి గోనెసంచి బరువుతో కలిపి 40.600 కిలోల చొప్పున తూకం వేయాలి. అయితే మిల్లర్ల నుంచి గొడవలు ఎందుకని మరో 500 గ్రాములు కలిపి 41.100 కిలోలు తూకం వేయాలని ఆఫీసర్లు ఇంటర్నల్​గా ఆర్డర్​ ఇచ్చారు. 

దీన్ని ఆసరాగా చేసుకున్న కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కొందరు మిల్లర్లతో ఒప్పందం చేసుకొని ఒక బస్తాను 42.200 గ్రాముల చొప్పున తూకం వేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో లారీకి ఏడు క్వింటాళ్ల వడ్లను ఎక్కువగా తూకం వేయిస్తున్నారు. అలా అయితేనే ట్రక్​ షీట్​ఇస్తామని, లేకుంటే ఇవ్వబోమని కొందరు మిల్లర్లు భీష్మించుకొని కూర్చుంటున్నారు. ఆలేరు మండలంలోని ఓ మిల్లరు ట్రక్​ షీట్​ విషయంలో పీఏసీఎస్ బాధ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయమై పై ఆఫీసర్లకు పీఏసీఎస్​ బాధ్యులు ఫిర్యాదు కూడా చేశారు.