యాక్సిడెంట్లలో యువతే ఎక్కువ చనిపోతున్నరు

యాక్సిడెంట్లలో యువతే ఎక్కువ చనిపోతున్నరు
  •  రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలె : డీజీపీ రవి గుప్తా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని డీజీపీ రవిగుప్తా అధికారులకు సూచించారు. యాక్సిడెంట్లలో ఎక్కువగా యువతే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగనున్న రోడ్‌‌‌‌ సేఫ్టీ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కమిషనర్ బుద్ధ ప్రకాష్, రోడ్‌‌‌‌ సేఫ్టీ, రైల్వేస్‌‌‌‌  అడిషనల్ డీజీ మహేష్ భగవత్, హైదరాబాద్​ సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డి, డీఐజీ రంగనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల ఎస్పీలు, సీపీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వాహనాల పెరుగుదల, ప్రయాణికులు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,68,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా.. రాష్ట్రంలో 7,500 మంది చనిపోయారని తెలిపారు. రోడ్ సేఫ్టీ క్లబ్బులు, డిస్ట్రిక్ట్‌‌‌‌ రోడ్ సేఫ్టీ బ్యూరో, కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరోలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ– చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్ బ్రీత్ అనలైజర్స్ కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి "గుడ్ సమా రిటన్" పేరిట సన్మానం చేయాలని డీజీపీ సూచించారు.