సంక్రాంతి బట్టల కోసం గొడవ.. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య

సంక్రాంతి బట్టల కోసం గొడవ..  ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య

నాగర్​ కర్నూల్, వెలుగు: సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనే విషయంలో చోటుచేసుకున్న గొడవ ముగ్గురి ప్రాణాలు తీసింది. నాగర్​కర్నూల్​జిల్లా లింగాల మండలం రాంపూర్ పెంటలో ఇద్దరు కూతుళ్లను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. లింగాల మండలం రాంపూర్​పెంటకు చెందిన చిన్న బయ్యన్న నల్లమలలోని పెద్దవాగు బేస్ క్యాంప్ వాచర్(ఔట్​సోర్సింగ్) పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య చిన్న నాగమ్మ(25), కూతుళ్లు బయ్యమ్మ(3), యాదమ్మ(1) ఉన్నారు. కాగా, గురువారం ఉదయం సంక్రాంతి పండుగకు పిల్లలకు కొత్త బట్టలు తీసుకుందామని నాగమ్మ భర్తతో చెప్పింది. తన దగ్గర పైసలు లేవని, మూడు నెలలుగా జీతం రావడం లేదని చిన్న బయ్యన్న సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. 

తర్వాత తీసుకుందాని చెప్పినా చిన్ననాగమ్మ వినిపించుకోలేదు. పనిమీద భర్త మన్ననూర్ ​వెళ్లగా, చిన్న నాగమ్మ ఇద్దరు కూతుళ్లను గొంతు నులిమి చంపేసింది. పిల్లల మృతదేహాలపై రగ్గు కప్పి, తర్వాత ఉరివేసుకుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పిల్లల అలికిడి లేకపోవడంతో స్థానిక చెంచులు చిన్న బయ్యన్న గుడిసెలోకి వెళ్లి చూడగా, పిల్లల మృతదేహాలు, పక్కనే నాగమ్మ మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే మన్ననూర్​లోని చిన్న బయ్యన్నకు సమాచారం ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ముగ్గురి ప్రాణాలు తీశాయని, చిన్న బయ్యన్నను ప్రభుత్వం ఆదుకోవాలని చెంచులు కోరారు. బేస్ క్యాంప్ వాచర్లకు పెండింగ్​జీతాలు చెల్లించి, తమనీ మనుషులుగా గుర్తించాలని వాపోయారు. ఇంటికి చేరుకున్న చిన్న బయ్యన్న భార్య, కూతుళ్ల మృతదేహాలపై కన్నీరుమున్నీరుగా విలపించాడు.

నెల జీతం వచ్చినా  మూడు ప్రాణాలు మిగిలేవి

నల్లమల అడవిలో పనిచేస్తున్న వాచర్లకు 3 నెలలుగా జీతాలు రావడం లేదు. పెంటల్లోని మహిళలు పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితి. పిల్లలకు కొత్త బట్టలు కొనలేక, భార్యకు సర్ది చెప్పకోలేక బయ్యన్న నలిగిపోయాడు. ఆర్థిక ఇబ్బందులకు మూడు ప్రాణాలు బలయ్యాయి. మాకు నెలకు ఇచ్చేది రూ.8,300. ఒక్క నెల జీతం ఇచ్చినా ముగ్గురూ ప్రాణాలతో మిగిలేవారు.

వాచర్లు రవి, కృష్ణ, హన్మంత్, లింగస్వామి