హర్యాతండాలో అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతి

హర్యాతండాలో అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతి
  • రోడ్డు ప్రమాదం జరిగిందంటున్న భర్త
  • మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోవడంతో డౌట్స్​
  • హత్య చేశారంటూ కుటుంబీకుల ఆందోళన
  • ఖమ్మం జిల్లాలో ఘటన  

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం పరిధిలోని హర్యాతండా వద్ద తల్లీ, ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కుక్క అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయగా రోడ్డు ప్రమాదం జరిగిందని కారు నడిపిన మృతురాలి భర్త చెప్తుండగా, డెడ్​బాడీలపై ఒక్క గాయం లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. రఘునాథపాలెం మండలం బావోజితండాకు చెందిన బొడా ప్రవీణ్​కు ఏన్కూరు మండలం రాంనగర్ తండాకు చెందిన కుమారి(25) కి కొన్నేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి కృషిక(4) , కృతిక (3) అనే కూతుళ్లున్నారు. 

మంగళవారం భార్యాభర్తలు, పిల్లల ఆధార్​ అప్డేట్​ చేయించడానికి కారులో ఖమ్మం వెళ్లారు. సాయంత్రం మంచుకొండ మీదుగా బావోజితండాకు వస్తుండగా హర్యాతండా వద్ద కుక్క అడ్డు వచ్చిందని, దీంతో సడన్ బ్రేక్ వేయగా అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొట్టిందని ప్రవీణ్​ చెప్తు న్నాడు. ప్రమాదంలో కుమారి, పిల్లలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ప్రవీణ్  నడుము విరగడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రవీణ్ హైదరాబాద్​లోని అత్తాపూర్ లో ఉన్న జర్మన్ టెక్ హాస్పిటల్ లో ఫిజియోథెరపిస్ట్. 

మా కూతురిని చంపేశారు 

తమ కూతురు కుమారిని, పిల్లలను ప్రవీణ్ ​చంపేశాడంటూ మార్చరీ వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రవీణ్​కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ మధ్యే ఆమెతో కలిసి 20 రోజులు కేరళ వెళ్లి వచ్చాడని చెప్తున్నారు. దీంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదం జరిగితే మృతదేహాలపై ఒక్క గాయం కూడా ఉండదా అని ప్రశ్నించారు. ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, సీఐ శ్రీహరి అక్కడికి వచ్చి బాధితులతో మాట్లాడారు.