
అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ.. ముద్దు ముద్దు పలుకులు పలుకుతూ.. చిరు చిరు అడుగులు వేస్తూ.. అమ్మ వేలు వదలకుండా ఉండే చిన్నారులంటే ఏ తల్లికైనా ఎంతో అపురూపం. ఆ వయసులో వాళ్లకు ప్రతీది ప్రశ్నే.. అన్నింటికీ సమాధానం చెబుతూ వాళ్లను తీర్చిదిద్దే మొదటి గురువు.. జీవిత ప్రధాత అమ్మ. కానీ ఈ అమ్మ మాత్రం వాళ్ల పాలిట యమపాశంలా తయారైంది. జనవరిలో ఒక కొడుకును పొట్టనపెట్టకున్న తల్లి.. ఇప్పుడు మరో కొడుకు మెడకు నైలాన్ తాడు చుట్టీ చంపేయడం ఆ అమ్మతనమే చినబోయే ఘటన.
ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీశ అనే తల్లి.. తన ఐదేళ్ల కుమారుడు మనీష్ కుమార్ ను చంపేసింది. ఈ కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు.
సెప్టెంబర్ 24న మనీష్ కుమార్ ను నైలాన్ తాడు తో మెడకు చుట్టి చంపేసింది తల్లి శిరీష. విచారణ తర్వాత కొడుకును చంపింది తానేనని ఒప్పుకున్న శిరీశను రిమాండ్ కు తరలించారు కేసముద్రం పోలీసులు.
విచారణ సందర్భంగా.. కొడుకును ఎందుకు చంపిందో చెప్పింది శిరీశ. భర్త తాగుడుకు బానిసై తననూ, తన పిల్లలనూ పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు పోలీసులకు చెప్పింది. తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనలో.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
జనవరిలో చిన్న కుమారుడిని నీటి సంపులో పడేసి..
విచారణ సందర్భంగా పోలీసులకు షాకింగ్ విషయాలు చెప్పింది శిరీష. 2025 జనవరి నెలలో చనిపోయిన తన చిన్న కుమారుడు నిహాల్ (2) ను కూడా తానే చంపినట్లు ఒప్పుకుంది. ఆ తర్వాత మరో కుమారుడిని హత్య చేయాలనుకుంటే అప్పుడు ఆ బాలుడు బతికీ బయటపడ్డాడు. చివరికీ సెప్టెంబర్ 24 న మరో కుమారుడిని చంపేసి పోలీసులకు దొరికిపోయింది.
భర్త తాగుడుతో కొడుకులు ఏమైపోతారోననే కారణంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పిన తల్లి.. చంపేముందు చేతులెలా వచ్చాయో అర్ధం కాని పరిస్థితి. కనీసం ఈమెకు భర్త అయినా ఉన్నాడు. కొందరు భర్తలు లేకపోయినా ఒంటరిగా కాయా కష్టం చేసి పిల్లలను పెద్దవాళ్లను చేసే తల్లులున్నారు. భర్త సహకారం లేకపోయినా వాళ్లను తీర్చిదిద్దాలనే ఆలోచన ఎందుకు రాలేదో. అంత దారుణమైన అనుభవిస్తుందో లేక.. చిన్న పాటి కష్టాలకు తట్టుకునే మనస్థైర్యం లేకో గానీ.. నవమాసాలు మోసీ జీవం పోసిన ఆ తల్లి.. ఆ చేతులతోనే ప్రాణాలు తీయడం ఘోర విషాదకరమైన ఘటన.