న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఖరారు కావడంతో ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా పెరగనుంది. ఈయూలోని 27 దేశాలకు మనదేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. చాలా వస్తువులు చౌకగా లభ్యం కానున్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
2014 నుంచి భారత్ ఏడు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యూఎస్ విధిస్తున్న 50 శాతం అధిక సుంకాల వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొంది. ఈ సమయంలో ఈయూతో ఎఫ్టీఏ కుదరడం వల్ల భారత ఎగుమతిదారులు తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరించుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల చైనాపై ఆధారపడటమూ తగ్గుతుంది.
ఎన్నో రంగాలకు మేలు..
ఈ ఎఫ్టీఏ వల్ల దిగుమతి సుంకాలు తగ్గుతాయి లేదా పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల మార్కెట్లు విస్తరించడంతో పాటు నిబంధనలు సులభతరం అవుతాయి. టెక్నాలజీ, ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ రంగాలకు మేలు జరుగుతుంది. తక్కువ సుంకాలు ఉండటం వల్ల వస్త్రాలు, తోలు వస్తువులు, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ మిషనరీ వంటి ఎగుమతులకు ఈయూ మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. టెలికం, వ్యాపార సేవలు, రవాణా వంటి సేవా రంగ ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. విమానాల విడిభాగాలు, ఎలక్ట్రికల్ మిషనరీ, వజ్రాలు, రసాయనాల ఎగుమతుల్లో ఈయూకు లబ్ధి చేకూరుతుంది. ఐటీ, టెలికాం రంగాల్లో యూరోపియన్ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది.
పెరగనున్న పోటీతత్వం..
2024 ఆర్థిక సంవత్సరంలో భారత్, ఈయూ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 136.53 బిలియన్ డాలర్లు ఉంది. ఇందులో భారత ఎగుమతులు 75.85 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 60.68 బిలియన్ డాలర్లు. భారత్ మొత్తం ఎగుమతుల్లో ఈయూ వాటా 17 శాతంగా ఉంది. ఈయూ దిగుమతుల్లో మనదేశం వాటా 9 శాతం ఉంది. ప్రస్తుతం భారత వస్త్ర ఉత్పత్తులపై 12 నుంచి 16 శాతం సుంకాలు ఉన్నాయి. దీనివల్ల బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడటం భారత్ కు కష్టమవుతోంది. ఈ ఒప్పందంతో ఆ సమస్య తీరనుంది.
మరిన్ని పెట్టుబడులు
యూరప్ దేశాల నుంచి భారత్ కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఇప్పటికే నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఎఫ్టీఏ వల్ల ఈ పెట్టుబడులు పెరిగి కొత్త పరిశ్రమలు రావడానికి, ఉపాధి పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. భారత తయారీ రంగానికి ఊతమిస్తుంది. మన విదేశీ మారక నిల్వలు పెరిగి ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ ఒప్పందం కీలకం అవుతుంది.
చౌకగా నాణ్యమైన వస్తువులు
యంత్రాలు, కంప్యూటర్లు, టర్బోజెట్ ఇంజన్లు, వైద్య పరికరాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. ఈయూ నుంచి వచ్చే వైన్లు, స్పిరిట్స్ వంటి ఇతర మద్య పానీయాలపై సుంకాలు తగ్గడం వల్ల వాటి ధరలు కూడా దిగి వస్తాయి. యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడం వల్ల తయారీ రంగానికి మేలు జరుగుతుంది. దీనివల్ల దేశీయంగా తయారయ్యే వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
