బిడ్డ పుట్టక ముందే అమ్మకానికి పెట్టిన తల్లి

బిడ్డ పుట్టక ముందే  అమ్మకానికి పెట్టిన తల్లి

నిజామాబాద్,  వెలుగు :  ఇద్దరు ఆడపిల్లలున్న తల్లి పోషించే స్థోమత లేక తన బిడ్డను అమ్మకానికి పెట్టి కటకటాల పాలైంది. శిశువును కొనుగోలు చేసిన ఇద్దరు మహిళల మధ్య పెంపకం విషయంలో గొడవ జరగడంతో విషయం పోలీసుల దాకా చేరింది. మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళతో పాటు మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. రెండు రోజుల కింద పుట్టిన మగశిశువును గవర్నమెంట్​ చైల్డ్​ కేర్​ సెంటర్​కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నగర ఏసీపీ కిరణ్​కుమార్​ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

నిజామాబాద్  సిటీలోని అంబేద్కర్  కాలనీకి చెందిన గోసంగి దేవీకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి గర్భం దాల్చిన ఆమె మళ్లీ కూతురు పుడుతుందని అనుమానించింది.  పేదరికం అనుభవిస్తున్నందున పుట్టే బిడ్డను అమ్మాలని ఆశా వర్కర్​ సలూంకేజియాకు దేవి చెప్పింది. దీంతో సలూంకేజియా.. పిల్లులులేని హుమేరా బేగం, షబానా బేగంను సంప్రదించింది. మగపిల్లాడు పుడితే రూ.లక్షన్నర, ఆడపిల్ల పుడితే రూ.లక్ష చెల్లించేలా గోసంగి దేవీతో బేరం కుదిర్చింది. ఇందు కోసం తనకు కొంత కమీషన్  ఇవ్వాలని అడిగింది.

 ముందుగా హుమేరా, షబానా రూ.5 వేలు అడ్వాన్స్​గా దేవీకి ఇచ్చారు. ఈనెల 3న ఆమెకు ఓ ప్రైవేటు హాస్పిటల్​లో మగబిడ్డ పుట్టగా హాస్పిటల్​ ఖర్చు రూ.20 వేలను హుమేరా, షబానా చెల్లించి తల్లీబిడ్డను ఇంటికి చేర్చారు. మగపిల్లాడు కావడంతో హుమేరా, షబానా  గొడవపడుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి కూపీలాగగా అంతా బయటపడింది. శిశువును అమ్మే ప్రయత్నం చేసిన దేవీతో పాటు హుమేరా, షబానా, మధ్యవర్తిగా వ్యవహరించిన సలూంకేజియాను అరెస్టు చేశారు.