కావాలనే కొందరు వక్రీకరిస్తున్నరు

కావాలనే కొందరు వక్రీకరిస్తున్నరు
  • సాగుకు నాణ్యమైన కరెంటు అందుతుంది
  • రైతుల నుంచి ఒక్క పైసా వసూలు చేయలే.. 
  • చేయబోం: ఏపీ అసెంబ్లీలో వెల్లడి

విజయవాడ, వెలుగు: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఎలాంటి నష్టం లేదని, రైతులకు మంచే జరుగుతుందని ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డి అన్నారు. ఈ విషయంపై కొంతమంది కావాలని దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన చర్చలో జగన్ మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు ఇచ్చే విద్యుత్​కు రైతుల నుంచి ఒక్క పైసా తీసుకోవడం లేదని భవిష్యత్తులో కూడా తీసుకోబోమని చెప్పారు. “మోటార్లకు మీటర్ల విషయంలో టీడీపీ, దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తోంది. సగం తెలిసి.. సగం తెలియని వాళ్లు, దురుద్దేశంతో కొందరు దీన్ని వక్రీకరిస్తున్నరు. మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పు అని చెప్తున్నరు. ఇదే ఆశ్చర్యం అనిపిస్తోంది. వీళ్లు ఏ ప్రపంచంలో ఉన్నరు. చిత్తశుద్ధి ఉందా? లేదా అని?  ఇప్పటి వరకు ఎక్కడా రైతుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయలేదు. ఇకపై కూడా  చేయబోం’’ అని అన్నారు.

మోటార్లకు మీటర్లతో నష్టమేం లేదు

‘‘మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల జరిగే మంచి ఏమిటో అందరూ తెలుసుకోవాలి. నాణ్యమైన విద్యుత్ రైతు వరకు చేరుతుంది. మోటార్లు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవు. నిజంగా ట్రాన్స్ ఫార్మర్స్ కెపాసిటీ సరిపోతుందా లేదా తెలుస్తుంది. సరిపోకపోతే. మోటార్ల అవసరానికి సరిపడే కెపాసిటీ ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పెడతాం. దీంతో రైతుకు నాణ్యమైన కరెంటు అందుతుంది. వారికి నష్టం లేకుండా కాపాడుకోగలుగుతం. మోటార్లకు మీటర్లతో గొప్ప మార్పు జరుగుతుంది. డిస్కంలను ప్రశ్నించే హక్కు కూడా రైతులకు ఇస్తున్నం. ఇన్ని మంచి మార్పులు జరుగుతున్నా.. కావాలని కొందరు వక్రీకరిస్తున్నరు. రైతుకు నష్టం చేస్తున్నరు” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫీడర్లు, సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయడం కోసం రూ. 1700 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో18 లక్షల 70వేల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సుమారు రూ.9 వేల కోట్లు బకాయిలు పెడితే ఆ భారాన్ని కూడా చెల్లించినట్లు తెలిపారు.