చీమల దండులా క్యూ : ఎవరెస్ట్​ శిఖరంపై ట్రాఫిక్​ జాం

చీమల దండులా క్యూ : ఎవరెస్ట్​ శిఖరంపై ట్రాఫిక్​ జాం

అదేదో దేవుడి దర్శనానికి క్యూ కట్టినట్టు.. సినిమా టికెట్ల కోసం లైన్‌‌‌‌లో నిలబడినట్టు.. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌‌‌‌పై క్యూ కట్టారు జనం. ఒకళ్లు కాదు.. ఇద్దరు కాదు.. పదులూ కాదు.. వందల సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్‌‌‌‌ కొండెక్కేందుకు ఒకేసారి సిద్ధమయ్యారు. మంచు కొండ​పై ట్రాఫిక్​ జాం అయింది. ‘డెత్​జోన్​’గా పిలిచే ప్రాంతంలో వందలాది మంది చీమల దండులా పైకి వెళ్లేందుకు లైన్‌‌‌‌లో నిలబడ్డారు. దీంతో ఓ ఇండియన్​ సహా ఇద్దరు చనిపోయారు. పర్వత శిఖరాన్ని చేరుకుని తిరిగి కిందకు దిగే క్రమంలో మహారాష్ట్రకు చెందిన అంజలి కులకర్ణి (55) చనిపోయారు. డొనాల్డ్​ లిన్​ క్యాష్​ (55) అనే అమెరికా వ్యక్తి కూడా శ్వాసలో ఇబ్బందులొచ్చి చనిపోయారు. ఎక్కువగా ఉన్న క్యూ వల్ల దిగేటప్పుడు చోటు సరిపోక అక్కడే ఇరుక్కుపోయి ఇబ్బందులేర్పడ్డాయని, అదే వాళ్ల మరణానికి కారణమని చెబుతున్నారు.

క్యూలో 320 మంది

నిర్మల్​ పూర్జా అనే పర్వతారోహకుడు ఇన్​స్టాగ్రామ్​లో ఎవరెస్ట్​పై పరిస్థితిని చూపించే ఓ ఫొటోను షేర్​ చేశాడు. బుధవారం శిఖరంపైకి చాలా మంది ఎక్కారని చెప్పాడు. ఎవరెస్ట్​పై 8 వేల మీటర్ల ఎత్తులో ‘డెత్​ జోన్​ (మృత్యు ప్రాంతం)’గా పేరున్న ప్రాంతం నుంచి దాదాపు 320 మంది దాకా క్యూ కట్టారని చెప్పాడు. అయితే, ఈ ట్రాఫిక్​ జాం వల్లే జనాలు చనిపోతున్నారన్న వార్తలను నేపాల్​ పర్యాటక శాఖ డైరెక్టర్​ జనరల్​ దందురాజ్​ ఘిమిరె కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమన్నారు. ఈ సీజన్​లో వాతావరణం అంతగా అనుకూలంగా లేదని, వాతావారణం కొంచెం బాగుందనిపిస్తే పైకి ఎక్కేస్తున్నారని ఆయన అన్నారు. మే 22న వాతావరణం బాగుండడంతో 200 మంది ఎవరెస్ట్​ శిఖరాన్ని ఎక్కేందుకు రెడీ అయ్యారన్నారు. ఎక్కువ ఎత్తుల్లో ఎదురయ్యే ఇబ్బందుల వల్లే చాలా మంది పర్వతారోహకులు చనిపోయారన్నారు.

తన తల్లికి పర్వతారోహణలో 25 ఏళ్ల అనుభవం ఉందని, ఎవరెస్ట్​ ఎక్కడంలో ఆరేళ్ల పాటు ట్రైనింగ్​ తీసుకుందని అంజలి కులకర్ణి కుమారుడు శాంతను కులకర్ణి చెప్పారు. రష్యాలోని ఎల్బర్స్, టాంజానియాలోని కిలిమంజారో శిఖరాలను ఎక్కారని చెప్పారు. 1922 నుంచి ఇప్పటిదాకా ఎవరెస్ట్​పై 200 మందికిపైగా చనిపోయారు. వాళ్ల మృతదేహాలన్నీ ఆ శిఖరంపైనే మంచు కింద సమాధి అయి ఉంటాయని భావిస్తున్నారు. భూమిపై దొరికే ఆక్సిజన్​తో పోలిస్తే 8 కిలోమీటర్ల ఎత్తులో దొరికేది కేవలం మూడింట ఒకవంతే. అంటే 30 శాతం. దీంతో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముక్కు, చెవులు, నోటి నుంచి రక్తం కారుతుంది. ఆరోగ్యం క్షీణించి ప్రాణం పోతుంది.