
సినిమా హీరోలకు మనదేశంలో మామూలు క్రేజ్ ఉండదు. నచ్చిన హీరో.. కుటుంబం కోసమో, ప్రేమ కోసమో ఫైట్ చేస్తుంటే ప్రేక్షకులు ఆ హీరోతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారు. ఆ హీరో పాత్రలో వాళ్లను ఊహించుకుంటారు. తాము చేయలేని పని హీరో చేస్తున్నందుకు ఆనందంతో కేకలేస్తారు. పండుగాడి పేరుతో అండర్‌కవర్ ఆపరేషన్స్ చేసే కృష్ణమనోహర్ ఐపీయస్‌ను.. తెలుగు ఆడియెన్స్.. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అయితే ప్రేక్షకులకు అంతగా చేరువైన హీరో క్యారెక్టర్‌ను కేవలం ఒక్క సినిమాకే పరిమితం చేస్తే ఎలా? సపోజ్.. కృష్ణ మనోహర్ ఐపీయస్.. ‘గబ్బర్ సింగ్’ను కలిస్తే.. కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అలాగే ‘రంగస్థలం’ చిట్టిబాబుకు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ‘పుష్పరాజ్’ ఎదురైతే ఏం జరుగుతుంది? ఇలా రెండు, మూడు హీరో పాత్రలను ఒక కథలో కలిపే ఐడియా కొత్తదేం కాదు. ఇదే ఫార్ములాతో మార్వెల్ కొన్నేండ్ల నుంచీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దీన్నే ‘మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్’ అని పిలుస్తున్నారు. అయితే ఇప్పుడీ ట్రెండ్ మన సినిమాల్లో కూడా మొదలైంది.
మార్వెల్ మ్యాజిక్
సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి ప్రేక్షకుడిని అందులో ఇన్వాల్వ్ చేయడంలో హాలీవుడ్ సినిమాలదే పైచేయి. అయితే మార్వెల్ ఎంటరయ్యాక ఈ గేమ్ మరింత రసవత్తరంగా మారింది. మార్వెల్ కామిక్స్, గ్రీక్ మైథాలజీని బేస్ చేసుకుని మార్వెల్ కొన్ని సూపర్ హీరో క్యారెక్టర్స్‌ను క్రియేట్ చేసింది. ప్రపంచాన్ని నాశనం చేయాలని చూసే కొంతమంది విలన్స్, ఆ విలన్స్ నుంచి ప్రపంచాన్ని రక్షించే సూపర్ హీరోస్. వీళ్ల మధ్య జరిగే పోరాటాలే మార్వెల్ సినిమాల బేసిక్ ఫార్ములా. మార్వెల్ సూపర్ హీరోస్ అయిన ఐరన్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో, థోర్, హల్క్ లాంటి వాళ్లంతా వేర్వేరు కథలతో ప్రేక్షకులకు పరిచయమైనా.. ‘అవెంజర్స్’ సినిమాలో చివరిగా ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేస్తారు. ఇలాంటి మూమెంట్స్‌ను.. ఆడియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అదే మల్టీవర్స్ సినిమాల్లో జరిగే మ్యాజిక్.
మల్టీవర్స్ మేనియా
ఒక సినిమాను మరో సినిమాతో ఇంటర్‌లింక్ చేస్తూ అవెంజర్స్, డాక్టర్ స్ట్రేంజ్, థోర్, స్పైడర్ మ్యాన్ లాంటి చాలా సినిమాలను మార్వెల్ తెరకెక్కించింది. ఓ కథలో క్యారెక్టర్ చిన్నగా కనిపించినా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అదే క్యారెక్టర్ మెయిన్ లీడ్‌గా మారుతుంది. అలా మరో కథ పుడుతుంది. మరో సినిమా తయారవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్‌ను తనవైపుకు తిప్పుకుంది మార్వెల్. అలాగే వండర్ వుమన్, బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్, ఆక్వామ్యాన్ లాంటి సూపర్ హీరో క్యారెక్టర్స్‌తో ‘జస్టిస్ లీగ్’ లాంటి సినిమాలు తీసిన డీసీ ఫ్రాంచైజీ కూడా మల్టీవర్స్ రేస్‌లో అదరగొడుతోంది. ఇలా సూపర్ హీరోస్, ఫ్యాన్ వార్స్ ఫార్ములాతో మార్వెల్, డీసీ ఫ్రాంఛైజీలు బాక్సాఫీస్‌ను ఎప్పటికప్పుడు బద్ధలు కొడుతూనే ఉన్నాయి.
మార్వెల్ తమ సినిమాటిక్ యూనివర్స్‌లోని ముఖ్యమైన సూపర్ హీరోస్‌ను సెపరేట్ సినిమాల ద్వారా పరిచయం చేస్తూనే.. ఒక హీరో కథలో మరొక హీరోని లింక్ చేస్తూ ఆడియెన్స్‌ను యూనివర్స్‌కు కనెక్ట్ చేసింది. ఇక అందరు హీరోలు ఒకేచోట కనిపించే క్రాస్ ఓవర్ సినిమాలు అవెంజర్స్, ఇన్ఫినిటీవార్, ఎండ్ గేమ్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టారు. మనదేశంలో కూడా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇన్నేండ్ల తర్వాత ఈ మల్టీవర్స్ ఐడియాను మన డైరెక్టర్లు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన డైరెక్టర్లు.. సింగిల్ లైన్ కథలకు బదులు సినిమాటిక్ యూనివర్స్ ప్రాజెక్టులపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు . సూపర్ హిట్టైన మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకుని కొత్త స్టోరీతో, సరికొత్త హీరోను పరిచయం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది రిలీజైన కొన్ని సినిమాలను బట్టి ఈ విషయం అర్థమవుతుంది. ‘బాహుబలి’ తర్వాత ఇండియన్ సినిమాలో చాలా మార్పులొచ్చాయి. ఇండియన్ సినిమాలకు కూడా ప్రపంచ స్థాయిలో పాపులారిటీ రావడంతో డైరెక్టర్లు తమ మేకింగ్ స్టైల్‌ను మార్చారు. హీరో, హీరోయిన్, విలన్, ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అనే ఫార్మాట్ నుంచి రకరకాల జానర్స్‌ను మిక్స్ చేస్తూ.. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మల్టీ స్టారర్ సినిమాలతో పాటు.. సూపర్ హీరోస్, మల్టీ యూనివర్స్ కథలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ థీమ్‌లో రూపొందుతున్న సినిమాలు ఇవే..
లోకివర్స్(ఖైదీ, విక్రమ్)
ఈ మధ్య రిలీజ్ అయిన కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో మొదటిసారి సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏంటో రుచి చూపించాడు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. 2019లో రిలీజైన తన చిత్రం ‘ఖైదీ’లో ఢిల్లీ, బిజోయ్ పాత్రలను విక్రమ్ కథకు లింక్ చేసి ‘ఖైదీ’కి ఉన్న కల్ట్ ఫ్యాన్ బేస్‌ను తిరిగి కంటిన్యూ చేయగలిగాడు. విక్రమ్ కథ రాస్తున్నప్పుడు లోకేశ్‌కు ఖైదీలోని బిజోయ్ లాంటి సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ అవసరమైందట. మళ్లీ కొత్తగా క్యారెక్టర్ రాయడమెందుకు అని అదే పాత్రను విక్రమ్ సినిమాలోకి తీసుకొచ్చి, రెండు కథలను కలిపాడు లోకేశ్. ఈ రెండు కథలను ఒక చోట ముడి వేసేందుకు రోలెక్స్ అనే మరో పవర్‌ఫుల్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడు. ఒక డ్రగ్ మాఫియా వరల్డ్‌ను సృష్టించి, ఈ చిత్రాలన్నింటినీ వాటికి కనెక్ట్ చేస్తూ సరికొత్త మల్టీవర్స్ సృష్టించాడు. ఈ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్.. ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.300 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ఇంకా నాలుగైదు సినిమాలు రావొచ్చని దర్శకుడు లోకేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకవైపు ఏజెంట్ ‘విక్రమ్’ కథ నడుస్తుండగానే మరోవైపు ‘ఢిల్లీ’ , ‘రోలెక్స్’ పాత్రలను కూడా క్లైమాక్స్‌లో చూపించి తన నెక్స్ట్ మూవీకి హింట్ ఇచ్చాడు. మొత్తానికి డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి, కొత్తకొత్త పాత్రలను ఇంట్రడ్యూస్ చేసి ప్రేక్షకులకు మల్టీవర్స్ గ్లింప్స్ ఇచ్చాడు లోకేశ్. ఖైదీ 2 తో పాటు, విక్రమ్ 2, విక్రమ్ 3 సినిమాలను కూడా ఆల్టర్నేటివ్‌గా షూటింగ్ చేసి అవతార్ సీక్వెల్స్‌లా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోకివర్స్‌లోకి రామ్ చరణ్, విజయ్ కూడా ఎంటర్ అవుతారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మొత్తానికి రోలెక్స్, విక్రమ్, ఢిల్లీ, అమర్, అన్బు.. ముఖ్య పాత్రలుగా ఉన్న ఈ లోకివర్స్‌లో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
అస్త్ర యూనివర్స్ (బ్రహ్మాస్త్ర)
బాలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ కూడా ఇదే కోవకు చెందుతుంది. హిందూ మైథాలజీలోని అస్త్రాలు, వాటి పవర్స్ ఆధారంగా ఒక అస్త్ర యూనివర్స్‌ను క్రియేట్ చేసినట్టు ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ అస్త్ర యూనివర్స్‌లో మొదటి భాగంగా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ’.. త్వరలోనే రిలీజ్ అవ్వబోతోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌లో భాగంగా రణబీర్ కపూర్ సినిమాటిక్ యూనివర్స్‌పై కామెంట్స్ చేశాడు. మార్వెల్‌లా మనం కూడా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. మన పురాణాలు, కథలతో సొంత సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయొచ్చని, ఇలాంటి కాన్సెప్ట్‌లే ప్రస్తుతం సినీ ప్రపంచానికి పనికొస్తాయనేది రణబీర్ వెర్షన్. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర.. మొత్తం మూడు భాగాలుగా రాబోతుంది. ఈ మూడు సినిమాలు అయాన్ ముఖర్జీ అస్త్ర యూనివర్స్ కిందకే వస్తాయి.
ప్రశాంత్ నీల్ యూనివర్స్
లోకేశ్ కనగరాజ్ కంటే ముందే తాను ఓ సినిమాటిక్ యూనివర్స్ చూపించబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ఫ్రాంచైజీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నీల్.. కేజీఎఫ్ 2 మూవీతో ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలను కలిగించాడు. కేజీఎఫ్3 కూడా ఉండబోతుందని చెప్పేశాడు. రాఖీభాయ్ బతికే ఉంటాడా? 1978 నుంచి 1981 మధ్యలో ఏం జరిగింది? నరాచి నుంచి మరో కొత్త హీరో బయటికొస్తాడా? అన్న ప్రశ్నలతో కేజీఎఫ్2 ను ముగించాడు. ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసిన ‘సలార్’, ఎన్టీఆర్ 31 సినిమాల నేపథ్యం కూడా కేజీఎఫ్ తరహాలోనే డార్క్ గ్రే కలర్ థీమ్‌లో ఉంది. కోల్ మైనింగ్ నేపథ్యంలో సాగే ‘సలార్’ సినిమాకు ‘కేజీఎఫ్’తో లింక్ ఉందని టాక్. కేజీఎఫ్2 లో ఈశ్వరీరావు కొడుకు ‘ఫర్మాన్’ అధీర చేతికి చిక్కిన తర్వాత అతడిని చంపేశారా? లేదా? అన్నది స్పష్టంగా చూపించలేదు. అంతేకాదు, కేజీఎఫ్2 నుంచే సలార్ సినిమా మొదలవుతుందనీ, చాప్టర్ 2 లో ప్రశాంత్ నీల్ స్పెషల్ ఫోకస్ చేసిన ఫర్మాన్ క్యారెక్టరే సలార్‌గా మారుతుందని టాక్ కూడా నడుస్తోంది. అయితే ‘ఫర్మాన్’ మెడలో ఉన్న లాకెట్టే “సలార్”లో ప్రభాస్ మెడలో ఉండడం, కేజీఎఫ్ చాప్టర్ 2లో ఫర్మాన్‌కి తల్లిగా కనిపించిన ఈశ్వరీరావు సలార్‌లో ప్రభాస్ అమ్మగా నటించడం లాంటి అంశాలను గమనిస్తే ఈ రెండు కథలకు లింక్ ఉందేమో అనిపిస్తోంది. ఇకపోతే కేజీఎఫ్ ఫ్రాంచైజీలో భాగంగా కొత్తకొత్త హీరోలు పుట్టుకొస్తారని, ప్రశాంత్ నీల్.. మార్వెల్ తరహా సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కేజీఎఫ్ ప్రొడ్యూసర్లు హింట్ ఇచ్చారు.“కేజీఎఫ్ ఫ్రాంఛైజీ నుంచి కెజీయఫ్3 మూవీ కూడా రాబోతుంది. అక్టోబర్ తర్వాత షూటింగ్ మొదలవుతుంది. 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాని మార్వెల్ మల్టీవర్స్ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం. వేర్వేరు చిత్రాల నుంచి వేర్వేరు పాత్రలను తీసుకొచ్చి ‘డాక్టర్ స్ట్రేంజ్’, ‘స్పైడర్ మ్యాన్’ సినిమాల తరహాలో రూపొందించాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు” అని హొంబాలె ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ చెప్పారు. దాంతో ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ కన్ఫర్మ్ అయినట్టే. మొత్తానికి తన సినిమాటిక్ యూనివర్స్‌ని రివీల్ చేయకముందే ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేశాడు ప్రశాంత్.
మలయాళీ సూపర్ హీరో మిన్నల్ మురళి
మాస్ మసాలా కథలకే ఎక్కువ పట్టం కంటే ఇండియన్ ఆడియెన్స్‌ను వైవిధ్యభరితమైన, సహజమైన కథలతో తనవైపుకు తిప్పుకుంది మలయాళీ సినిమా. ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడని ఓకొత్త సూపర్ హీరోను పరిచయం చేసింది. ఇప్పటివరకూ వెండితెరపై కనిపించిన సూపర్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి సూపర్ హీరోలు, వాళ్లకు ఉండే పవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్వెల్, డీసీ కామిక్స్ ద్వారా ఎందరో సూపర్ హీరోలు ప్రపంచానికి పరిచయం అయ్యారు. అయితే, భారతీయ తెరపై సూపర్ హీరో పాత్రలు చాలా తక్కువ. మార్వెల్ సూపర్‌హీరో తరహాలో ఇక్కడి ప్రేక్షకులకు ఒక సూపర్ హీరో ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘మిన్నల్ మురళి’. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరోస్‌కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఈ నేపథ్యంలో ఇండియా నుంచి ఒక సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే అతడు రొటీన్ సూపర్ హీరోలా ఉంటే కుదరదు. ఏదైనా కొత్తదనం ఉండాలి. అందుకే అరుణ్ అనిరుధన్, జస్టిన్ మాథ్యూల సూపర్‌హీరో కథను భారతీయ నేటివిటీకి దగ్గరగా తెరకెక్కించి ప్రయోగం చేశాడు దర్శకుడు బాసిల్ జోసెఫ్. మెరుపుదాడికి గురైన ఇద్దరు వ్యక్తులకు సూపర్ పవర్స్ రావడం, వాళ్లు ఆ శక్తులను గుర్తించి, ఎలా ఉపయోగించారు? అనే సన్నివేశాలను ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు తీర్చిదిద్దారు. సాధారణంగా డీసీ కామిక్స్‌లో విలన్స్ భయంకరమైన లుక్‌తో, అత్యంత శక్తిమంతులుగా కనిపిస్తారు. కానీ, ‘మిన్నల్ మురళి’లో జేసన్, శిబులకు మాత్రం వారికి ఎదురయ్యే పరిస్థితులే ప్రధాన శత్రువులు. రెండు పాత్రల మధ్య సంఘర్షణ సృష్టించి ఆద్యంతం ఆసక్తి కలిగించేలా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. సూపర్ హీరో మూవీస్‌లో ఈ సినిమా కొత్త ఒరవడిని సృష్టించింది. అయితే మిన్నల్ మురళి కూడా సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమే. దర్శకుడు బాసిల్ జోసెఫ్ తన మొదటి చిత్రం ‘కుంజిరామాయణం’లో క్రియేట్ చేసిన ‘దేశం’ అనే విలేజ్‌లో లాలూ అనే పాత్రకు కూడా మెరుపుదాడి జరిగి, కొన్ని పవర్స్ వస్తాయి. అయితే ఆ పవర్స్‌ను ఉపయోగించి లాలూ చేసే పనులన్నీ సూపర్ హీరో తరహాలో కాకుండా, ఫన్నీగా, నవ్వు తెప్పించేలా ఉంటాయి. బాసిల్ జోసెఫ్ యూనివర్స్ నుంచి మరో సినిమా వస్తే.. అందులో మెరుపుదాడికి గురైన మిన్నల్ మురళి, లాలూ ఒకరికొకరు ఎదురయ్యే అవకాశం ఉంది.
శైలేష్ ‘హిట్’ యూనివర్స్
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి, తన ‘వాల్‌పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘హిట్: ది ఫస్ట్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా 2020లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘హిట్: ది సెకండ్ కేస్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. అడివి శేష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “నాని, మిగతా చిత్ర బృందం కలిసి హిట్ సినిమాని మార్వెల్ లాంటి సినిమాటిక్ యూనివర్స్‌లా మార్చడానికి ప్లాన్ చేస్తున్నారు” అని చెప్పాడు. ప్రతి సినిమాలో వేర్వేరు హీరోలు నటిస్తూ ఉంటారని, త్వరలోనే ‘హిట్3’ కూడా రాబోతోందని హింట్ ఇచ్చాడు అడివి శేష్.
రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ (సింగం)
2021 లో రిలీజైన ‘సూర్యవంశీ’ సినిమాతో దర్శకుడు రోహిత్ శెట్టి.. సరికొత్త కాప్ యూనివర్స్‌ను క్రియేట్ చేశాడు. ఎంతో ఇంటెన్స్‌డ్‌గా ఉండే ‘సింగం’ క్యారెక్టర్‌ను, ఫన్నీ పోలీస్ ఆఫీసర్ ‘సింబా’ పాత్రను ‘సూర్యవంశీ’ కథలోకి తీసుకొచ్చి సినిమాటిక్ యూనివర్స్‌కు తెరలేపాడు. సూర్యవంశీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘దేశీ అవెంజర్స్ ఆఫ్ ది కాప్ యూనివర్స్’ అంటూ ‘సింగం’, ‘సింబా’ మీట్స్ ‘సూర్యవంశీ’ అని పోస్ట్ చేశారు. ఫ్యూచర్లో ఈ పోలీస్ క్యారెక్టర్లు వేరే సినిమాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో ఇప్పటివరకూ సింగం(2011), సింగం రిటర్న్స్(2014), సింబా(2018), సూర్యవంశీ(2021) సినిమాలు రాగా, 2023లో ‘సింగం3’ రాబోతుంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్
మన తెలుగు సినిమా నుంచి ఫస్ట్ ఎవర్ సూపర్ హీరో సినిమాగా ‘హనుమాన్’ రాబోతోంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ ను అనౌన్స్ చేశాడు. అంతేకాదు, హనుమాన్ రిలీజవ్వక ముందే తన సినిమాటిక్ యూనివర్స్‌లోని మరో సినిమా ‘అధీరా’ ను కూడా అనౌన్స్ చేశాడు. మొత్తంగా ఈ యువ దర్శకుడు ప్రస్తుతానికి ఇద్దరు సూపర్ హీరోలను క్రియేట్ చేశాడు. మరి మున్ముందు ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇంకెంతమంది చేరతారో చూడాలి.
స్పై యూనివర్స్
సినిమాటిక్ యూనివర్స్‌ల లిస్ట్‌లోకి తాజాగా వచ్చి చేరిన మరో ప్రాజెక్ట్ .. యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’. బాలీవుడ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టిన మూడు స్పై హీరోల కథలను ఒక తాటిపైకి తెచ్చే ఐడియా ఇది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ గతంలో నిర్మించిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల్లో సల్మాన్ ఖాన్.. రా ఏజెంట్‌గా కనిపిస్తాడు. అలాగే 2019 లో విడుదలైన వార్ సినిమాలో కబీర్ (హృతిక్ రోషన్) కూడా రా ఏజెంటే. అయితే ప్రస్తుతం ఈ బ్యానర్ నిర్మిస్తున్న పఠాన్ సినిమాలో షారుక్ ఖాన్ కూడా మరో పవర్‌ఫుల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. పఠాన్ విడుదలైన తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి మల్టీవర్స్ కథ రాబోతుందట. ఇందులో షారుక్.. పఠాన్‌గా, సల్మాన్.. టైగర్‌గా, హృతిక్.. కబీర్‌గా ఒకే సినిమాలో కనిపించనున్నారు. హాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘వార్-2’ లో ఈ మూడు స్పై పాత్రలు కలవబోతున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్, మల్టీవర్స్ చిత్రంలో కత్రినాకైఫ్, దీపికా పదుకొనె కూడా ఉంటారని టాక్.
మైథావర్స్
‘గజిని’, ‘క్వీన్’ లాంటి సూపర్ హిట్ హిందీ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన మధు మంతెన కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పాడు. “ఇండియన్ హిస్టరీ, మైథాలజీని కలిపి ఒక మైథావర్స్‌ను డిజైన్ చేయొచ్చు. ఈ మైథావర్స్‌లోని కథలు త్రేతాయుగం నుంచి మొదలై ద్వాపర యుగం, కలియుగం వరకూ ఉంటాయి. త్రేతాయుగం నాటి సూపర్ హీరోల క్యారెక్టర్స్‌ను ఇప్పటి కలియుగం వరకూ లింక్ చేయొచ్చు. రామాయణ, మహాభారతాలను మించిన మల్టీవర్స్‌లు లేవు. ఆ కథలకు సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను జోడిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌ను అవి ఎంతగానో ఆకట్టుకుంటాయి’’ అని అంటున్నాడు మధు.
సినిమాటిక్ యూనివర్స్ అంటే..
సాధారణంగా ఒక సినిమాలో ఉండే కథ, పాత్రలు కేవలం ఆ సినిమా వరకే పరిమితం అవుతుంటాయి. కానీ సినిమాటిక్ యూనివర్స్‌లో అలా కాదు. ఒక సినిమాలో కనిపించే పాత్ర మరొక సినిమా కథలో ఎంట్రీ ఇస్తుంది. ఒక సినిమా కథ.. మరొక సినిమా కథతో లింక్ అవుతుంది. వేర్వేరు కథల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పాత్రలు.. మరొక సినిమాలో కనెక్ట్ కావడాన్నే ‘మల్టీవర్స్ కాన్సెప్ట్’ అంటారు. ఇలా కథలు, పాత్రలతో ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించడమే సినిమాటిక్ యూనివర్స్ అంటే.
మల్టీవర్స్ – మల్టీ స్టారర్ – సీక్వెల్
ఒక కథకు ఇద్దరు హీరోలుంటే అది మల్టీ స్టారర్. అలా కాకుండా రెండు వేర్వేరు కథలతో మన ముందుకొచ్చిన ఇద్దరు హీరోలు.. ఒకే కథలో కలిస్తే అది మల్టీవర్స్. ఇక సీక్వెల్ అనేది దీనికి పూర్తిగా భిన్నం. సీక్వెల్ లేదా ప్రీక్వెల్.. ఒకే కథకు సంబంధించిన అంశాలు. కథను కంటిన్యూ చేస్తూ ముందుకి తీసుకెళ్తే సీక్వెల్, వెనక్కి తీసుకెళ్తే ప్రీక్వెల్.
ఎన్నో కథలు పుట్టించొచ్చు
తెలుగు సినిమాల్లో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయాలన్న ఆలోచన నా మొదటి సినిమా నుంచీ ఉంది. అయితే డైరెక్టర్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత అలాంటి ప్రాజెక్ట్ మొదలుపెట్టాలనుకున్నా. ప్రస్తుతం నేను తీస్తున్న సినిమాటిక్ యూనివర్స్‌లో నాలుగు సినిమాలు ఉండబోతున్నాయి. ‘హనుమాన్’, ‘అధీరా’లను ఇప్పటికే అనౌన్స్ చేశాం. నా సినిమాలోని సూపర్ హీరో పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ నుంచి ఇన్‌స్పైర్ అయినవే. మైథాలజీ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్‌కు నా వంతు క్రియేటివ్ టచ్ ఇచ్చి, ఎప్పుడూ చూడని ఓ కొత్త ప్రపంచాన్ని, సరికొత్త సూపర్ హీరోలను డిజైన్ చేశాం.
ఒక కథలోని పాత్రలను మరొక కథలోకి తీసుకురావడం ఎప్పటినుంచో ఉన్నా పూర్తి స్థాయిలో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయడం ఈ మధ్యనే మొదలైంది. సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం అందులో ఉండే క్యారెక్టర్లు. కథకోసం క్యారెక్టర్లు రాసుకునేటప్పుడు అవి ఎంతో బలంగా ఉండేలా చూసుకుంటాడు ఏ దర్శకుడైనా. అలాంటి బలమైన క్యారెక్టర్లు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే వాటిని కంటిన్యూ చేయడం ఒక్కటే దారి. మార్వెల్ లాంటి ఫ్రాంఛైజీలు చేస్తున్నది కూడా ఇదే. అంతేకాకుండా ఒక కొత్త సూపర్ హీరోను సృష్టించినప్పుడు ఆ పాత్ర చుట్టూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయొచ్చు. ఆ క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఇంకెన్నో క్యారెక్టర్లు అల్లొచ్చు. అలా ఒక సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తే దాన్నుంచి ఎన్నో కథలను పుట్టించొచ్చు. ఈ ఫార్ములా దర్శకుడి ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్తుంది. అయితే ఒక మల్టీవర్స్ సృష్టించి.. ఒక కథలోని హీరోని మరొక కథలోకి తీసుకొచ్చినంత మాత్రాన అది ప్రేక్షకుడికి నచ్చుతుందని చెప్పలేం. దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ వరల్డ్ ఆడియెన్స్‌కు నచ్చాలి. పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోవాలి. కథ, కథనం అన్నీ సరిగ్గా కుదరాలి. అప్పుడే ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి. మల్టీవర్స్ ఫ్రాంఛైజీల్లో ఒక సినిమా హిట్ అయితే ఆ సిరీస్ నుంచి వచ్చే మిగతా సినిమాలకు కూడా మంచి క్రేజ్ వస్తుంది. అందుకే ప్రొడ్యూసర్లు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఫ్యూచర్లో తెలుగు సినిమాల్లో ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్‌లు చాలానే రావొచ్చు. – ప్రశాంత్ వర్మ,
దర్శకుడు మల్టీవర్స్‌కు రాజమౌళి ‘నో’
బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన రాజమౌళి మాత్రం సొంత సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్‌లో మార్వెల్ గురించి ఎదురైన ప్రశ్నకు మార్వెల్ మూవీస్‌పై తనకు పట్టులేదని చెప్పారు. వాటిని ప్రేక్షకుడిగానే ఆస్వాదిస్తానన్నారు. వీలైతే ఇక్కడి పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకొస్తానని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మల్టీవర్స్ తరహాలో ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా భారతీయ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ఎదుగుతున్న టైంలో ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్‌లు సక్సెస్ అయితే ఇండియన్ సినిమా హాలీవుడ్‌కి గట్టి పోటీ ఇచ్చినట్టే.
మల్టీవర్స్ మార్కెటింగ్
హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే.. భారతీయ సినిమా భిన్నంగా ఉంటుంది. కథ, కథనం, థీమ్ అన్నింటిలో లోకల్ టచ్ కనిపిస్తుంది. మన సినిమాల్లోని హీరోలు చాలా సాదాసీదాగా, మనలో ఒకరిగా కనిపిస్తారు. తన ప్రేమను గెలిపించుకోవడం లేదా ఫ్యామిలీని కాపాడుకోవడమే హీరో లక్ష్యంగా ఉంటుంది. కానీ హాలీవుడ్ హీరో ఫార్ములా అలా కాదు. హాలీవుడ్ కథల్లో హీరో లక్ష్యం సాధారణ వ్యక్తులకు అంతుచిక్కని స్థాయిలో ఉంటుంది. అందుకే వారికి సూపర్ హీరోల అవసరం ఏర్పడింది. ఒక సూపర్ హీరోని క్రియేట్ చేశాక వారిని ఒకే సినిమాకు పరిమితం చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అందుకే మల్టిపుల్ హీరోలను ఓ చోట చేర్చి మల్టీవర్స్ కథలను అల్లుకున్నారు. ఈ ఫార్ములా సూపర్ హీరోస్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ను రెట్టింపు చేసింది.
గతంలో కూడా...
సినిమాటిక్ యూనివర్స్‌లా కాకపోయినా... ఒక సినిమాలోని పాత్రలు వేరొక సినిమాలో కనిపించడాన్ని కొన్ని పాత సినిమాల్లో కూడా గమనించొచ్చు. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో ప్రదీప్ రావత్ పోషించిన రాజ్ బిహారీ పాత్ర సిద్దార్థ్ హీరోగా నటించిన ‘ఓయ్’ సినిమాలో కూడా కనిపిస్తుంది. రజినీకాంత్, శంకర్ కాంబోలో వచ్చిన ‘రోబో’ సినిమాలో ‘చిట్టి ద రోబో’ పాత్ర షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘రా. వన్’ చిత్రంలో కూడా కనిపిస్తుంది. ఎస్వీ కృష్ణారెడ్డి ‘యమలీల’ చిత్రంలో తనికెళ్ళ భరణి పోషించిన తోట రాముడు పాత్ర.. ‘ఘటోత్కచుడు’ చిత్రంలో కూడా కంటిన్యూ చేశాడు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. రజినీకాంత్ ‘నరసింహ’ లోని నీలాంబరి పాత్ర ‘బాబా’ సినిమాలో కూడా కనిపిస్తుంది.
ఆ కిక్కే వేరు
సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తోంది. ఒకరకంగా అది మంచిదే. ‘హిట్’ అనే ఆలోచనకు మూలం కూడా అదే. ఒక కాప్ యూనివర్స్ క్రియేట్ చేయాలన్న ఆలోచన నుంచే ‘హిట్’ సిరీస్ కూడా పుట్టింది. ఇందులో ప్రతీ సినిమా నుంచి వేర్వేరు ఆఫీసర్స్ పరిచయమవుతూ ఉంటారు. కానీ కథలన్నీ ఒకే యూనివర్స్‌లో జరుగుతుంటాయి. ‘హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)’ అనే ఒక డిపార్ట్‌మెంట్.. రకరకాల మర్డర్ మిస్టరీలను ఎలా సాల్వ్ చేస్తుంది? అనేదే ఈ సిరీస్‌లోని మెయిన్ ప్లాట్. ఇందులో ఫస్ట్‌కేస్‌లో తెలంగాణ నుంచి ఆఫీసర్‌గా విశ్వక్ సేన్ కనిపించారు. సెకండ్ కేస్‌లో ‘హిట్’ ఆఫీసర్‌గా అడివి శేష్ నటిస్తున్నారు. మూడో కేస్‌లో మరో హీరో ఉంటాడు. అయితే వీళ్లంతా ‘హిట్’ అనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు కాబట్టి.. రాబోయే సినిమాల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆఫీసర్లు కలిసి ఒకే కేసుపై పనిచేయాల్సి రావచ్చు. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ ఆడియెన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది. ఒక సినిమాలోని క్యారెక్టర్ మరొక సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లో వచ్చే కిక్కే వేరు. అలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను ఆడియెన్స్ ఎంతగానో ఇష్టపడతారు.కథ రాస్తున్నప్పుడు రైటర్‌కు అందులోని పాత్రలతో ఒకరకమై కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ పాత్రలను మరిన్ని కోణాల్లో చూడాలనుకుంటాడు. కానీ రెండున్నర గంటల సినిమాలో అంత స్కోప్ ఉండకపోవచ్చు. అదే ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తే.. పాత్రలను మరింత లోతుగా డిజైన్ చేసేందుకు అవకాశముంటుంది. ఒక రైటర్ ప్రతిభ బయటపడేది కూడా ఇక్కడే. అందుకే ఇలాంటి కథలు రాయడాన్ని నేనెంతో ఇష్టపడతా. ‘హిట్’ యూనివర్స్‌లో ఆరు లేదా ఏడు కథలు ఉంటాయి. ‘హిట్ ది ఫస్ట్ కేస్’ కథ చెప్పినప్పుడే ఈ సినిమాటిక్ యూనివర్స్ ఐడియాను ప్రొడ్యూసర్ నాని గారికి చెప్పా. ఆయన ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అలా మా ‘హిట్’ యూనివర్స్ మొదలైంది.
- శైలేష్ కొలను, దర్శకుడు ::: తిలక్