నెట్‌ లేకున్నా సినిమాల డౌన్‌ లోడ్‌

నెట్‌ లేకున్నా సినిమాల డౌన్‌ లోడ్‌

మూడు నిమిషాల్లో సినిమా డౌన్‌‌లోడ్‌
జీ5 యాప్‌ తో 10 మెట్రో స్టేషన్లలో అవకాశం
హైదరాబాద్‌‌ మెట్రోలో జీ5 సేవలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఇంటర్నెట్‌‌ లేకున్నాసినిమాలు చూడటం, డౌన్‌‌లోడ్‌‌ చేసు కోవడానికి షుగర్‌ బాక్స్‌‌ కంపెనీ హైదరాబాద్‌‌లోని పది మెట్రో స్టేషన్లలో లోకల్ వై–ఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకుండానే ఈ నెట్ వర్క్​ పనిచేస్తుంది. ఇందుకోసం రూపొందించిన మొబైల్‌‌ అప్లికేషన్‌‌ను మెట్రోరైల్‌‌ ఎండీ ఎన్వీఎస్‌‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో మరిన్ని స్టేషన్లలో వై–ఫై హాట్‌‌స్పాట్లను మొదలుపెడతామని ప్రకటించారు. కేవలం మూడు నిమిషాల్లో సినిమా డౌన్‌‌లోడ్‌‌ అవుతుందని చెప్పారు. వచ్చే నెలాఖరుకు జేబీఎస్‌‌–ఎంజీబీఎస్‌‌ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. అనంతరం షుగర్‌ బాక్స్‌‌ సీఈఓ రోహిత్‌ మాట్లాడుతూ మొదటి 60 రోజుల వరకు ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు. తరువాత కూడా నామమాత్రంగానే చార్జీలు వసూలు చేస్తామన్నారు. జీ5 యాప్‌‌లోని ఐదు వేల సినిమాలు, షోలు మెట్రో యూజర్లకు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. తదనంతరం గేమింగ్‌‌, ఫుడ్‌‌, ఈ–కామర్స్‌‌, ఈ–లెర్నింగ్‌‌ సర్వీసులను అందజేస్తామని వివరించారు.