రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం

రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా పూర్తైందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ర్టంలో టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని అన్నారు. హన్మకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ర్ట ప్రభుత్వంపై ఎంపీ అర్వింద్ నిప్పులు చెరిగారు.

మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్... బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన విమర్శలను ఎంపీ అర్వింద్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ రాష్ర్ట ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ఎంపీ అర్వింద్ కొన్ని ప్రశ్నలు వేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఎంపీ అర్వింద్ ఏమన్నారంటే...? 
* వరి వేస్తే ఉరి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా..? 2021 వరకూ కోటి 42 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కావాలా..? అని ప్రశ్నించారు. 

* భారీ వర్షాలు, వరదలతో పంటలు కొట్టుకుపోతే పట్టించుకోని సీఎం కేసీఆర్ కావాలా..? లేక ఫసల్ బీమా పథకంతో రైతులను ఆదుకుంటున్న మోడీ కావాలా..?

* నిరుపేదలకు, ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇంట్లు కట్టించి, ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ కావాలా..? లేక దేశంలోని నిరుపేద మహిళలకు 3కోట్ల 20లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చిన మోడీ కావాలా..? 

* కరోనా సమయంలో నిరుపేద, సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఎటువంటి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టని సీఎం కేసీఆర్ కావాలా..? లేక 20 కోట్లకు పైగా కుటుంబాలను ఆదుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిన మోడీ కావాలా..? 

* అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పర్చి.. కొత్త రాజ్యాంగం కావాలని చెప్పిన కేసీఆర్ కావాలా..? లేక అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కావాలా..? అని ప్రశ్నించారు. 

* రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ కావాలా..? లేక దళితుడిని రాష్ర్టపతిని, గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన నరేంద్ర మోడీ కావాలా..? 

* ప్రతిరోజూ 18 గంటలు ఫాం హౌజ్ లోనే ఉండే కేసీఆర్ కావాలా..? లేక 18 గంటలు కష్టపడే ప్రధాని నరేంద్ర మోడీ కావాలా..? 

* గత 8 ఏళ్ల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ కావాలా..? మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా,  ముద్ర లోన్ల ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న మోడీ కావాలా..? 

* అవినీతి జాతిపీత (కేసీఆర్ ను ఉద్దేశించి) కావాలా..? అవినీతిపై పోరాటం చేస్తున్న మోడీ కావాలా..? అని ప్రశ్నించారు. 

* రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ కావాలా..? ప్రపంచలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చిన  మోడీ కావాలా..? అని ప్రశ్నించారు.