కాంగ్రెస్  నేతల దీక్ష ఎన్నికల  స్టంట్ : బండి సంజయ్

కాంగ్రెస్  నేతల దీక్ష ఎన్నికల  స్టంట్ : బండి సంజయ్
  •     కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే తప్పుకుంటారా?: సంజయ్
  •     అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించారని ఫైర్

కరీంనగర్, వెలుగు : నిరసనల పేరుతో కాంగ్రెస్  నేతలు చేస్తున్న దీక్షలు ఎన్నికల స్టంట్  అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్  అన్నారు. పదేండ్ల నరేంద్ర మోదీ పాలనపై ప్రజలే తీర్పుఇవ్వబోతున్నారని ఆయన చెప్పారు. ‘‘మోదీ పాలనను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు.. మళ్లీ కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తే మీ పదవులకు రాజీనామా చేస్తారా?” అని ఆయన సవాల్ విసిరారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో ఆయన విగ్రహానికి, అనంతరం ఎంపీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి సంజయ్  నివాళులర్పించారు.

అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని నెహ్రూ అశాస్త్రీయ విధానాలను ప్రశ్నించారనే అక్కసుతో కుట్రలు చేసి అంబేద్కర్ ను రెండుసార్లు ఓడించారని పేర్కొన్నారు. ఆయనను చట్టసభల్లోకి రాకుండా చేసిన కాంగ్రెస్  పార్టీ తీరును చూస్తుంటే కత్తితో పొడిచి చంపి తర్వాత సంతాపం తెలిపినట్లుందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు. ఆయన ఆశయ సాధన కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు.