బీజేపీ, కాంగ్రెస్ ​పొత్తా..? కారు కూతలు మానుకోవాలి : బండి సంజయ్‌

బీజేపీ, కాంగ్రెస్ ​పొత్తా..? కారు కూతలు మానుకోవాలి : బండి సంజయ్‌
  • బీఆర్ఎస్‌పై ఎంపీ బండి సంజయ్‌ ఫైర్​ 
  • ప్రధానిని రేవంత్​ ఐదేండ్ల పాటు పెద్దన్నలాగే చూడాలని సూచన
  • గెలిచాక కేంద్ర నుంచి నిధులు తెస్తామని ప్రకటన 

హుజూరాబాద్ రూరల్(శంకరపట్నం), వెలుగు : బీజేపీ, కాంగ్రెస్ తూర్పు పడమర వంటి పార్టీలని, రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయంటున్న బీఆర్ఎస్ నేతలు కారు కూతలు మానుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఫైర్​ అయ్యారు. బుధవారం శంకరపట్నం మండలం గద్దపాక నుంచి ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర గద్దపాక, కాచాపూర్, మెట్​పల్లి, లింగాపూర్, కొత్తగట్టు, కేశవపట్నం మానకొండూర్, అన్నారంలో కొనసాగింది. సంజయ్​ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్​రెడ్డి కలవడంపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడాన్ని తప్పు పట్టారు. 

రేవంత్ రెడ్డి ప్రధానిని  ఐదేండ్లపాటు పెద్దన్న లాగే చూడాలని, తాము గెలిచాక  కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు.  కేసీఆర్ ​మాదిరిగా  ప్రధానిని చిల్లర మల్లర తిట్లు తిట్టి ప్రజల్లో చులకన కావద్దని హితవు పలికారు. రాష్ట్రంలోని 17 లోక్​సభ సీట్లలో బీజేపీని గెలిపించాలన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కాకపోతే కేంద్రం ఇచ్చే సబ్సిడీలన్ని ఆగిపోతాయన్నారు.  జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు సమ్మిరెడ్డి, మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్  పాల్గొన్నారు.