317 జీఓను సవరిస్తారా లేదా? ఎంపీ బండి సంజయ్ డిమాండ్

317 జీఓను సవరిస్తారా లేదా?  ఎంపీ బండి సంజయ్ డిమాండ్

గంగాధర, వెలుగు: ఉద్యోగులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న 317 జీఓను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్​చేశారు. జీఓను వ్యతిరేకిస్తూ సీఎస్ ఆఫీస్​ముందు ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోరా? అని మండిపడ్డారు. సోమవారం కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం చర్లపల్లి(ఎన్​)లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సంజయ్​మీడియాతో మాట్లాడారు. 317జీఓపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియజేయాలని డిమాండ్​చేశారు.

ఈ జీవోను సవరించాలని బీజేపీ ఎంతో పోరాడిందని, తన ఆఫీసులో నిరసనకు దిగితే పోలీసులు గ్యాస్ కట్టర్లతో గేట్లను ధ్వంసం చేసి తనను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ నేతలు జీఓను సవరించాలని డిమాండ్​చేసినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెట్టుకొకరు, పుట్టకొకరయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్​ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్​గుప్తాను కోరారు. వారితో ఫోన్​లో మాట్లాడి రైతుల ఇబ్బందులు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్​ పొట్టాల కనుకయ్య, నాయకులు పాల్గొన్నారు.