కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను ఇంటింటికి తీసుకెళ్లండి : ఎంపీ బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను ఇంటింటికి తీసుకెళ్లండి : ఎంపీ బండి సంజయ్
  •     10న సిరిసిల్లలో జరిగే దీక్షను సక్సెస్‌‌ చేయండి

కరీంనగర్, వెలుగు: పదేళ్లలో బీఆర్ఎస్‌‌తోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో చేస్తున్న మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నేతన్నల పరిస్థితి దుర్భరంగా మారిందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల మోసాలవల్ల 4 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మూతపడిందని, నేతన్నలు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. కరీంనగర్‌‌‌‌లోని ఓ కన్వెన్షన్ లో ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్నలకు మద్దతుగా ఈ నెల 10న సిరిసిల్లలో దీక్ష చేయబోతున్నట్లు చెప్పారు. ఈ దీక్షకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.  సమావేశంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర ఇన్‌‌చార్జి అభయ్ పాటిల్,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, లీడర్లు ప్రవీణ్ కుమార్, వికాస్ రావు, మీసాల చంద్రయ్య, డి.శంకర్ పాల్గొన్నారు.

ఈ నెల 15 నుంచి సమావేశాలు

ఈ నెల 15 నుంచి 18 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, ఏప్రిల్ 30న వివిధ మోర్చాల నాయకులతో సమావేశం కావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి తెలిపారు.  దీంతోపాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలతోనూ ప్రత్యేకంగా భేటీ నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు చెప్పారు.