గవర్నర్ నిర్ణయం కరెక్టే : బండి సంజయ్

గవర్నర్ నిర్ణయం కరెక్టే : బండి సంజయ్
  • గవర్నర్ నిర్ణయం కరెక్టే 
  • రబ్బర్ స్టాంప్ లా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నరు: బండి సంజయ్
  • గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో సర్కార్ ఘోర వైఫల్యం

కరీంనగర్, వెలుగు : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజ్ శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపిన ఫైల్​ను గవర్నర్ తమిళిసై తిరస్కరించడం ముమ్మాటికీ సరైన నిర్ణయమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వినాయక నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ టవర్ సర్కిల్ లో ఏర్పాట్లను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలనుకుంటున్నదని, వాళ్లు పంపిన ఫైళ్లన్ని చూడకుండా సంతకం పెట్టాలనుకుంటున్నదని విమర్శించారు.

గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే ఆమెకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఇది సరి కాదని మండిపడ్డారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు. మరికొద్ది గంటల్లో గణేశ్ నిమజ్జనం జరగాల్సి ఉన్నప్పటికీ.. ఇంతవరకు ఏర్పాట్లే పూర్తి చేయలేదని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. టవర్ సర్కిల్ కు విగ్రహాలను తీసుకురావొద్దని, నేరుగా నిమజ్జనానికి వెళ్లాలని, లేదంటే ఇబ్బంది పడతారంటూ ఉత్సవ కమిటీలను ఆఫీసర్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. 

‘‘మీరు బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదు. అసలు మీరెవరు బెదిరించడానికి? అందరూ టవర్ సర్కిల్ కు వస్తరు. ఇక్కడి నుంచే నిమజ్జనానికి వెళతాం.. ఏం చేస్తారో చూస్త. మీరు గనుక మళ్లీ బెదిరిస్తే నేనే అక్కడికి వస్త. అక్కడే కూర్చుంటా.. మీరు బెదిరిస్తే పండుగలు జరుపుకోలేని దుస్థితిలో హిందూ సమాజం లేదు” అంటూ మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. టవర్ సర్కిల్ లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, కరెంట్ వైర్లు తొలగించకపోవడం, నిమజ్జన ఏర్పాట్లు చేయకపోవడంపై  సంజయ్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట గంగాడి కృష్ణారెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు.