
యాదాద్రి, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. సీఎంతో చర్చకు రావాలంటే.. ప్రతిపక్ష హోదా ఉండాలని కేటీఆర్‌కు సూచించారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కావాలని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోకుండా మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని కేసీఆర్అప్పులపాలు చేశారని విమర్శించారు. తెచ్చిన అప్పును కూడా సక్రమంగా వినియోగించలేదన్నారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక.. తెలంగాణ-–ఆంధ్ర పేరుతో ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. కృష్ణా నది నీటి వాటాను ఎన్నడూ వాడుకోలేదన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్మించకుండా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు తంగెళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్తదితరులు పాల్గొన్నారు.