
- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నల్గొండ, వెలుగు : ప్రతి నియోజకవర్గంలోని పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నకిరేకల్ ఎంపీడీవో ఆఫీస్ లో ఇందిరమ్మ ఇంటి నమూనాను ఎంపీ చామల, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదవారికి ఇల్లు ఉండాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా కేటాయించాలని మంత్రిని కోరారు.
తహసీల్దార్ కార్యాలయం నూతన భవనాన్ని మంజూరు చేయాలని, గతంలో ఎస్ఎల్బీసీ కోసం తీసుకున్న భూముల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను పారదర్శకంగా కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి 200 ఇండ్లకు ఒక గెజిటెడ్ అధికారిని ఏర్పాటు చేసి సర్వే నిర్వహించిన తర్వాతే జాబితా రూపొందించామన్నారు. ఫైనల్జాబితాను ఇన్చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డైయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇన్చార్జి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అడిషనల్కలెక్టర్ కలెక్టర్ రాజ్ కుమార్, ఆర్డీవో అశోక్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కార్మికుల, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం..
శాలిగౌరారం (నకిరేకల్) : ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మోత్కూర్ మీదుగా ఉప్పల్ ఎక్స్ రోడ్డు వరకు వెళ్లే బస్సును శాలిగౌరారంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జెండా ఊపి వారు ప్రారంభించారు. అనంతరం వారు బస్సు ఎక్కి టికెట్ తీసుకొని శాలిగౌరారం మండల కేంద్రంలో తిరిగారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.