అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

చిట్యాల, వెలుగు : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి భూమిపూజ చేశారు. గ్రామంలో ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గుపోసుకున్నవారి స్థలాలను పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో అన్ని గ్రామాల్లో అర్హుల జాబితా రూపొందించామన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే బాధ్యత తను తీసుకుంటానని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నైట్ హాల్ట్ బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

చిట్యాల, వెలుగు: వెలిమినేడు ప్రజల సౌకర్యార్థం దిల్ సుఖ్ నగర్ నుంచి వెలిమినేడు గ్రామానికి నైట్ హాల్ట్ బస్సును ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఆర్టీసీ బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే బస్సులో టికెట్ తీసుకుని గ్రామంలో జాతీయ రహదారి వరకు ప్రయాణం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి.కృష్ణనాయక్, ఎంపీడీవో జయలక్ష్మి, ఆర్టీసీ డీఎం సుమతి, ఆర్టీసీ సీఐ పావని, వెలిమినేడు పీఏసీఎస్​ చైర్మన్ ఏనుగు రఘు మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనరసింహ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.